ఏటూరునాగారం, అక్టోబర్ 20 : ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని కొమురంభీం స్టేడియంలో మూడు రోజుల పాటు గిరిజన క్రీడోత్సవాలు గురువారం కనులపండువలా ముగిశాయి. అండర్-14, 17 విభాగాల్లో అధికారులు పోటీలు నిర్వహించగా ఫైనల్స్‌లో ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు-1, 2, మైదాన ప్రాంతం -1, 2 జోన్ల క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఈవెంట్లలో సుమారు 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చివరిరోజు విజేతలకు ఐటీడీఏ పీవో అంకిత్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ చందన బహుమతులు అందించారు. ఇక్కడ ప్రతిభ చూపినవారు భద్రాచలంలో నిర్వహించే ఆల్ సొసైటీ క్రీడా పోటీల్లో పాల్గొంటారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : ఐటీడీఏ పీవో అంకిత్
క్రీడాకారులు మంచి ప్రతిభ చూపించారని.. ఇదే స్ఫూర్తితో ఆడి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని పీవో అంకిత్ ఆకాంక్షించారు. వచ్చే నెల భద్రాచలంలో సొసైటీ క్రీడలు ఉన్నాయని అందులో కూడా క్రీడాకారులు సత్తాచాటాలని కోరారు. క్రీడాకారుల కోసం మంచి ఏర్పాట్లు చేశామని పీవో తెలిపారు. ముగింపు కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ చందన, ట్రెయినీ ఐఏఎస్‌లు రాధికాగుప్తా, శ్రీజ, ఫజాన్ అహ్మద్, పి.గౌతమి, పింకేశ్‌కుమార్, లెనిన్ వాస్తల్ టోప్పో, శ్రివేంద్ర ప్రతాప్, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డీడీలు పోచం, మంకిడి ఎర్రయ్య, జహీరుద్దిన్, ప్రేమకళ, ఏటీడీవో దేశీరాం నాయక్, పీహెచ్‌వో రమణ, ఎస్వో రాజ్‌కుమార్, ఈఈ హేమలత, క్రీడల నిర్వహణ అధికారులు కిష్టు, మోహన్‌నాయక్, శ్యామలత, ఆదినారాయణ, వజ్జ నారాయణ, ఏసీఎంవోలు రవీందర్, శ్రీరాములు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు పొదెం కృష్ణప్రసాద్, జబ్బ రవి, చేల బాబురావు, స్కౌట్ మాస్టర్ గోపాల్, ఫకీరా, ఉపాధ్యాయులు, ఖోఖో కన్వీనర్ సుద్ద కొమ్మాలు, పీడీలు లక్ష్మీనారాయణ, తోలెం సమ్మయ్య, ఈసం నాగేశ్వర్రావు, వెంకన్న, శరత్‌బాబు, కృష్ణ, రమేశ్, సతీశ్ పాల్గొన్నారు.
జీవితంలో రాణించాలంటే బాగా కష్టపడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో మంచి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు, లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు తమ దృష్టికి తీసుకరావాలని కోరారు. క్రీడాకారులు బాగా ఆడారని.. గెలుపు కోసం పోటీ పడాలన్నారు. ఓడిపోతే గెలుపు కోసం ఆడాలన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. తల్లిదండ్రులు, గురువుల కోసం బాగా కష్టపడాలని కలెక్టర్ కోరారు.
– కలెక్టర్ కృష్ణ ఆదిత్య