కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సౌకర్యాలు కల్పించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట-చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,300 ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే అంతర్గత రోడ్లు పూర్తయ్యాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టంతోపాటు విద్యుత్ సరఫరా కోసం దశలవారీగా సబ్ స్టేషన్లు నిర్మిస్తోంది. తాజాగా మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం రూ.100 కోట్లతో గురువారం పనులు ప్రారంభించినట్లు ఇంజినీర్లు వెల్లడించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద ఉన్న చలివాగు ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలతో పైపులైన్ ద్వారా మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రతిరోజు 12 మిలియన్ లీటర్ల నీటిని తరలించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. టెండర్ దక్కిన కాంట్రాక్టు సంస్థ ఏడాది కాలపరిమితిలో పనులు పూర్తి చేసేందుకు ఒప్పందం చేసుకుంది.
వరంగల్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : వస్త్రనగరిలో మౌలిక వసతుల కల్పనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత రహదారులు నిర్మించింది. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసింది. విద్యుత్ సరఫరా కోసం దశలవారీగా సబ్ స్టేషన్లు నిర్మిస్తోంది. తాజాగా మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం రూ.100 కోట్లతో పనులు చేపట్టింది. గురువారం ఈ పనులు ప్రారంభమైనట్లు మిషన్ భగీరథ ఇంజినీర్లు వెల్లడించారు.
ముందుగా పైపులైన్ నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు ప్రకటించారు. గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,300 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అన్ని విధాలా అనువుగా ఉండటంతో ఈ పార్కులో వస్త్ర పరిశ్రమలను స్థాపించేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే గణేశ ఓకో స్పేర్ లిమిటెడ్ కంపెనీ రెండు వస్త్ర పరిశ్రమలు నిర్మించింది. వీటిలో ఒకటైన గణేశ ఎకో టెక్ పరిశ్రమను గత మే 7న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.
ఈ పరిశ్రమలో ఉత్పత్తి కూడా మొదలైంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కేరళ రాష్ర్టానికి చెందిన ప్రముఖ కిటెక్స్ కంపెనీ రూ.1,600 కోట్లతో ఈ పార్కులో వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇక్కడ సదరు కంపెనీకి కేటాయించిన స్థలంలో వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు అదేరోజు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. సౌత్ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీకి ఈ పార్కులో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వస్త్ర పరిశ్రమల నిర్మాణం జరిగే ప్రదేశాన్ని ఆయన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. 182 యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన షోలాపూర్‌కు చెందిన ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం ఈ పార్కులో 52 ఎకరాలు కేటాయించింది.
రానున్న 18 నెలల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సుమారు ఇరవై యూనిట్లు పనిచేస్తాయని, తద్వారా దాదాపు 30 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. తాగునీటి సరఫరా కోసం తొలివిడుత ప్రభుత్వం ఈ పార్కులో రెండు డెలివరీ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 0.586 మిలియన్ లీటర్ల నీటిని పైపులైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. ఇప్పటికే పరిశ్రమలు నిర్మించిన గణేశ ఎకో స్పేర్ లిమిటెడ్ కంపెనీతో పాటు వివిధ పనులు చేస్తున్న కంపెనీలకు ఇది ఉపయోగపడుతుంది.
మెగా పార్కులో భూములను పొందిన వివిధ కంపెనీల వస్త్ర పరిశ్రమల నుంచి కొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుండడంతో ప్రభుత్వం రెండోవిడుత విద్యుత్, తాగునీటి సరఫరా పనులకు పూనుకుంది. మరో సబ్ స్టేషన్ నిర్మాణంతో పాటు రూ.100 కోట్లతో మిషన్‌భగీరథ పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద గల చలివాగు ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలతో పైపులైన్ ద్వారా మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రతిరోజు 12 మిలియన్ లీటర్ల నీటిని తరలించేందుకు మిషన్ భగీరథ ఇంజినీర్లు ప్రణాళిక రూపొందించారు.
ఈ మేరకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతి లభించడంతో ఇటీవల రూ.100 కోట్లతో చేపట్టే పనుల కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. టెండర్ దక్కిన కాంట్రాక్టు సంస్థ పనులు మొదలైన రోజు నుంచి ఏడాది కాలపరిమితిలో పూర్తి చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. పంపింగ్ కోసం జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయరైన చలివాగు ప్రాజెక్టు వద్ద ఇన్‌టేక్‌వెల్(పంపుహౌస్) నిర్మిస్తారు. ఈ పంపుహౌస్‌లో 250 హెచ్‌పీ కెపాసిటీతో కూడిన మూడు విద్యుత్ మోటర్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్, విద్యుత్ లైన్ నిర్మిస్తారు. పంపుహౌస్ నుంచి మెగా టెక్స్టైల్ పార్కు వరకు సుమారు 40 కిమీ పొడవున 500 ఎంఎం డయా పైపులైన్ వేసి పార్కులో నీటి నిల్వ కోసం 2,500 కిలోలీటర్ల సామర్థ్యంతో ఒక సంప్ నిర్మిస్తారు. చలివాగు ప్రాజెక్టు నుంచి పార్కు వరకు చేరిన నీటిలో నుంచి మిషన్ భగీరథ అధికారులు కొంత శుద్ది చేయని రా వాటర్, మరికొంత ఫిల్టర్ చేసిన నీటిని ఇస్తారు.
అవసరాలకు అనుగుణంగా పార్కులో శుద్ధిచేసిన, చేయని నీటి సరఫరా కోసం టీఎస్ఐఐసీ అంతర్గత పైపులైన్లను నిర్మించనుంది. రెండో విడుత చేపట్టిన రూ.100 కోట్ల మిషన్‌భగీరథ పనులకు పార్కులో మంత్రి కేటీఆర్ గత మే 7న శంకుస్థాపన చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో మిషన్ భగీరథ అధికారులు ఇపుడు రూ.100 కోట్ల పనులను మొదలుపెట్టారు. పంపుహౌస్‌తో పాటు 40 కిమీ పొడవున పైపులైన్ నిర్మాణ పనులు జరిగే ప్రదేశంలో కాంట్రాక్టు సంస్థ జంగిల్ క్లియరెన్సు పనులను పూర్తి చేసి గురువారం చలివాగు వైపు నుంచి పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) మల్లేశ్ చెప్పారు. నిర్దేశిత గడువు ఏడాదిలోపు ఈ పనులను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.