జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజల ముంగిట్లోకి చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఆరేళ్లలో ఉమ్మడి జిల్లా అద్భుత ప్రగతిని సాధించింది. అనతి కాలంలోనే జిల్లాలు అనూహ్యంగా అభివృద్ధి చెందాయి. రూ. వేల కోట్లతో పట్టణాలు, మున్సిపాలిటీలు అందంగా ముస్తాబయ్యాయి. పల్లె చెంతకే సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల సమస్యలు వెనువెంటనే పరిష్కారమవుతున్నాయి. విద్య, వైద్యాభివృద్ధికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేసింది. మూడు జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. త్వరలో మానుకోట వైద్య కళాశాల వాడుకలోకి రానుంది. జయశంకర్ భూపాలపల్లిలో 100 పడకల దవాఖాన సేవలందిస్తున్నది. కొత్త జిల్లాలు ఆరేళ్లు పూర్తి చేసు కుని ఏడో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన చేరువ చేసింది. ఆయా జిల్లాల్లో ప్రగతి పరుగులు పెడుతోంది. ప్రజలకు దూరభారం తగ్గి వారి సమస్యలు తొందరగా పరిష్కారమవు తున్నాయి. ఆశించిన ఫలాలు కళ్లెదుటే కనపడుతుండటంతో వారు మురిసిపోతున్నారు. 2016 అక్టోబర్ 11న ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి అనేక మార్పులు సంత రించుకుని అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నాయి.
వేగంగా భూపాలపల్లి అభివృద్ధి
జిల్లా ఆవిర్భావంతో దూరభారం తగ్గడమే గాక అభివృద్ధి, సంక్షేమం అందరికీ చేరువైంది. 20 మండలాలతో జిల్లా పరిధి తగ్గి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు రహదారులు, వంతెనల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. జిల్లా కేంద్రంలో వంద పడకల దవాఖాన నిర్మించగా, ప్రజలకు సేవలందిస్తున్నది. మెడికల్ కళాశాల మంజూరు కాగా, ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
సుందరంగా హనుమకొండ కలెక్టరేట్
జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని అద్భుతంగా నిర్మించారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కూడళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. చిన్న జిల్లాలు కావడం వల్ల జిల్లా స్థాయి అధికారులు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ప్రజా సమస్యలు తొందరగా పరిష్కారమవుతున్నాయి.
మానుకోట అభివృద్ధి బాట..
నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాటి నుంచి మానుకోట అభివృద్ధి బాట పట్టింది. తొర్రూరు రెవెన్యూ డివిజన్‌తోపాటు పెద్దవంగర, చిన్నగూడూరు, దంతాలపల్లి, గంగారం మండలాలుగా ఏర్పడ్డాయి. 261 తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. ఇవేకాకుండా మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలకు రూ.40కోట్ల చొప్పున నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాకేంద్రంలో రూ. 2 కోట్లతో అత్యాధునికంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. సాలార్ తండా సమీపంలో సుమారుగా 30 ఎకరాల్లో రూ.52 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యం, ఎస్పీ కార్యాలయం సమీపంలో 30 ఎకరాల్లో రూ.46కోట్లతో మెడికల్ కళాశాలను నిర్మించారు. త్వరలోనే వీటిని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఇటీవలే ప్రభుత్వం ఇనుగుర్తి, సీరోలు మండలాలను ప్రకటించింది. త్వరలోనే ఎమ్మెల్యేలు వీటిని అధికారికంగా ప్రారంభించనున్నారు.
కరువు నేలకు కొత్త కళ
నాడు కరువు గడ్డగా ముద్రపడ్డ పరిస్థితి నుంచి నేడు జనగామ జిల్లా గోదావరి జలాలతో పునీతమై జలాశయాలన్నీ నిండుకుండలా కళకళలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలో 45 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా కలెక్టరేట్‌ను నిర్మించారు. మోడల్ రైతు బజార్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆర్టీసీ చౌరస్తాలో వాటర్ ఫౌంటేన్‌తో కూడిన ఎలిఫెంట్ సర్కిల్ సహా బస్టాండ్ సెంటర్ నుంచి నెహ్రూ పార్కు వరకు రోడ్ల విస్తరణ, నలువైపులా సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, మినీ, ఇండోర్ స్టేడియం, బతుకమ్మకుంట సుందరీకరణ, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కళాశాల, జిల్లా కోర్టు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో జిల్లా కేంద్రానికి కొత్త హంగులు సమకూరాయి.
వరంగల్‌లో మెగా పార్క్
జిల్లా ఏర్పాటుతో ప్రజలకు సేవలు మరింత చేరవయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై క్షేత్రస్థాయిలో అధికారుల మానిటరింగ్ పెరిగింది. అభివృద్ధి పనులు నిర్దేశిత లక్ష్యం ప్రకారం జరుగుతున్నాయి. అర్హులకు సంక్షేమ పథకాలు చేరుతుండడంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తుండడంతో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి.