జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 25 : ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆదివారం సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు’ ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. జనగామ పట్టణ కేంద్రంలోని పలు కాలనీల్లో మహిళలు ఒకచోట చేరి ‘ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములో సందమామ…, ‘చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా.. అందాల బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’ అంటూ బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. పాత బీటు బజార్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున పాల్గొని బతుకమ్మ ఆడారు. పట్టణ కేంద్రంలోని బతుకమ్మకుంటలో జరిగిన వేడుకలకు పుర ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ముగిసిన అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు. బతుకమ్మ కుంటలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ అధికారులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ వేడుకల్లో జనగామ అర్బన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
బచ్చన్నపేట : ఎంగిలిపూల బతుకమ్మను ఆదివారం సంబురంగా జరుపుకున్నారు. మహిళలు తంగేడు, గడ్డిపువ్వు, చామంతి వంటి రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చారు.. ప్రధాన చౌరస్తాల్లో అలంకరించి రాత్రి వరకు ఆడారు. బతుకమ్మ కోసం జీపీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. చెరువులు, ప్రధాన చౌరస్తాల వద్ద ప్రత్యేక లైటింగ్ సౌకర్యం కల్పించారు. మండల ప్రజలకు, మహిళలకు రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ జీ భాగ్యలక్ష్మీ అంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీ కృష్ణంరాజు, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, సర్పంచ్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, దూడల కనకయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లవరం వెంకటేశ్వర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు షబ్బీర్‌లు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. చెరువుల వద్ద ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని ఎస్సై నవీన్‌కుమార్ సూచించారు.
జఫర్‌గఢ్ : మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి, ఆచార వ్యవహారలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు బతుకమ్మ పండుగ మొదటి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ (పెత్రమాస బతుకమ్మ) పండుగా జరుపుకుంటారు. గ్రామాల్లో మహిళలు ఉదయం నుంచే తీరొక్క పూలతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. వయో భేదాన్ని మరిచి చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలందరూ ఆనందోత్సహాల మధ్య బతుకమ్మలు చేతబట్టి కోలాటం, ఉయ్యాల, డీజే పాటలతో బతుకమ్మ తల్లిని కొలుస్తూ ఆడి, పాడారు. గ్రామాల్లోని ఆలయాల వద్ద ఎంగిలి బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకున్నారు.
కొడకండ్ల : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. అన్ని గ్రామాల సర్పంచ్‌లు ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఆడపడుచులు బతుకమ్మను పేర్చి, ఆలయాలు, చెరువుల వద్ద వాటిని పాటలతో పూజించి, నీటిలో వదిలారు. అన్ని గ్రామాల్లో చిన్నాపెద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
చిల్పూరు : మండలంలోని చిన్నపెండ్యాలలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడారు. ఏర్పాట్లను సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, చిల్పూరు ఎస్సై రాజు పర్యావేక్షించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తాళ్లపెల్లి సమ్మయ్య, మండల రైతు కోర్డినేటర్ జనగామ యాదగిరి, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ఇల్లందుల సదర్శన్, తాళ్లపెల్లి సంపత్ కుమార్, గజ్జెల దామోదర్, మాజీ సర్పంచ్ టీ సమ్మయ్య, నాయకులు మాచర్ల కొమురయ్య, టీ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
జనగామ రూరల్ : ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా ఆడపడుచులు, మహిళలు, యువతులు రంగురంగుల దుస్తులతో పాటు ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని గ్రామాల్లో అందంగా బతుకమ్మను పేర్చి సాయంత్రం వేళ సంబురంగా బతుకమ్మ ఆడిపాడారు. యువతులు, మహిళలు ప్రభుత్వం అందించిన సారెను కట్టుకొని బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. గ్రామాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. పెంబర్తిలో జడ్పీటీసీ నిమ్మతి దీపిక, మార్కెట్ చైర్ పర్సన్ బాల్దె విజయ, వడ్లకొండలో సర్పంచ్ బొల్లం శారద, ఎల్లంలలో ఎంపీటీసీ బండ లక్ష్మీ వెంకటేశం, మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బతుకమ్మ ఆడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చెరువుల వద్ద జీపీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఎంగిలి పూల బతుకమ్మను మహిళలు కన్నుల పండువగా జరుపుకున్నారు. బతుకమ్మ ఆడే స్థలంలో జీపీ సిబ్బంది విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఎస్సై తాళ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు నిర్వహించారు. కార్యక్రమంలోఎంపీపీ నల్లా నాగిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వీ యాకాంతారావు, జడ్పీటీసీ పూస్కరి శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పస్నూరి నవీన్‌కుమార్, జడ్పీకో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
దేవరుప్పుల : మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మతో 9 రోజుల బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. జీపీల ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మలు ఆడడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీకరణతో వెలుగులు కనిపించాయి. ఇంటింటికీ ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి సాయంత్రం వేళ వాగు, చెరువుగట్టున బతుకమ్మ ఆడారు. ఉదయం నుంచే బతుకమ్మ సంబురాలు గ్రామాల్లో కనిపించగా తంగేడుపూలు, గునుగుపూలు, చేమంతి, బంతి పూలను తేవడానికి గుంపులుగా వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు కనిపించారు.
తరిగొప్పుల : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఎంగిలి పూల బతుకమ్మ పండుగను ఆదివారం మహిళలు, ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల సర్పంచ్‌లు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ హరితా సుదర్శన్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడ్డి, జడ్పీటీసీ పద్మజా వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రమీలా సంజీవ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జార్జిరెడ్డి, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్పూర్ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు, యువతులు, చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు. డివిజన్ కేంద్రంలో రిజర్వాయర్, శివాలయం, వివిధ గ్రామాల్లో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి జీపీ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేశారు.