తీరొక్క పూలతో ఆదిపరాశక్తిని కొలిచేందుకు వేళయింది. నేటి ఎంగిలిపూలతో మొదలై బతుకమ్మ సంబురాలు తొమ్మిది రోజుల పాటు అంబరాన్నంటనున్నాయి. ఆడబిడ్డలు పాట చిలుకలై.. వాకిళ్లన్నీ పూదోటలై హోరెత్తనున్న బతుకమ్మ పాటల బృందగానాలతో వీధులన్నీ మార్మోగనున్నాయి. సద్దుల కోసం పుట్టింటికి వస్తున్న తోబుట్టువులతో ప్రతి ఇల్లూ సందడిగా మారుతున్నది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 24 : ప్రపంచమంతా పువ్వులతో దేవుడిని కొలుస్తుంది.. కానీ పూలనే పూజించే అరుదైన సంస్కృతి తెలంగాణది.. అలాంటి అద్భుత ఘట్టానికి వేళయింది. నేటి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల దాకా సంబురాలు హోరెత్తనున్నాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. పాడి పంటలనూ ఉయ్యాలో.. చల్లంగ చూడమ్మ ఉయ్యాలో.. ’..అంటూ సాగే బృందగానాలతో పల్లె, పట్టణం మార్మోగనున్నాయి. జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. పల్లెపడుచులతో పాటు పట్టణ మహిళలకూ ఇదే ఇష్టమైన వేడుక. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి దాకా(ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల (పెద్ద) బతుకమ్మదాకా) ప్రతి రోజూ మహిళలు ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు. నిత్యం సద్దులు పంచుకొని తింటూ వేడుకలా జరుపుకుంటారు. ఎంగిలిపూల నుంచే మహిళల సందడి మొదలవుతుంది. మగవారు పూలసేకరణలో నిమగ్నం కాగా, ఆడవాళ్లు వాటిని అందంగా పేర్చి, ఆడుతారు. బతుకమ్మ పండుగ ప్రకృతి పూజ. ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల పూలను, వాటితో గౌరమ్మను పూజించడం ఈ పండుగలోని విశిష్టత.
తొమ్మిది రోజులు.. తీరొక్క విధంగా..
మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా జరపుకొంటారు. వేయించిన బియ్యం, నువ్వులు, పల్లీలు, మక్కలను చక్కెర, బెల్లంలో ఏదో ఒకదానితో కలిపి దంచి పెట్టుకుని, నెయ్యితో కలిపి ఉండలుగా చుట్టి పంచుకుంటారు. రోజూ బతుకమ్మ ఆడి, నిమజ్జనం చేశాక, యువతులు, మహిళలంతా ఒక్కచోట చేరి, వెంట తెచ్చిన సత్తుపిండిని సిబ్బుల్లో ఇచ్చిపుచ్చుకుంటూ అందరమూ సమానమేననే ఔన్నత్యాన్ని చాటుతారు.
మమతానురాగాలను మూటగట్టుకొనిపెళె్లై మెట్టినింటికి వెళ్లిన మహిళలంతా ప్రతి బతుకమ్మ పండుగకి పుట్టింటికి చేరుకుంటారు. మమతానురాగాల బతుకమ్మలను పేర్చి, సంతానం, పాడీపంటా చల్లంగుండాలని ఆడిపాడుతారు. ఏడాదికి సరిపడా ఆనందాన్ని మూటగట్టుకొని మెట్టినింటికి వెళ్తారు.
ఎటుచూసినా పూల పరిమళం..
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలుస్తోన్న బతుకమ్మ పండుగ వచ్చిందంటే.. పల్లెదారులన్నీ పూల పరిమళాలు వెదజల్లుతాయి. తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, కట్ల పూలు, మందారాలు, గన్నేరు, గుమ్మడి, రుద్రాక్ష, గోరింట.. ఇలా తీరొక్క పువ్వు బతుకమ్మ పండుగను ఆహ్వానిస్తూ కనిపిస్తాయి. పూలతో బతుకమ్మను పేర్చి, ఆదిపరాశక్తి(గౌరి)ని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకం.