వరంగల్, సెప్టెంబర్ 18(నమస్తేతెలంగాణ) : పది శాతం రిజర్వేషన్ల ప్రకటనతో గిరిజనుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. ఎన్నో ఏళ్ల కల సాకారమైందంటూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. ముఖ్యమంత్రి తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మురిసి పోయారు. ప్రధానంగా గిరిజన గ్రామాలు, తండాలు, గూడేల్లో పండుగ వాతావరణం కనిపించింది. సోమవారం కూడా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో గిరిజనులు సంబురాలు జరుపుకుంటున్నారు. కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. పటాకులు కాల్చి మిఠాయి లు పంచుతున్నారు. గిరిజన జాతి సముద్ధరణ కేంద్రాలైన బంజారా, ఆదివాసీ భవన్లను శనివారం ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో రాష్ట్రం లో గిరిజనులకు రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. రిజర్వేషన్ల పెంపు జీవో వారం రోజుల్లో జారీ చేస్తామని చెప్పారు. భూమి లేని గిరిజనులకు త్వరలో పోడు భూములను పంపిణీ చేస్తామని, దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకాన్ని ప్రారంభించి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటించిన ఈ వరాలతో గిరిజనుల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది.
వాడవాడనా సంబురాలు జరుపుకుంటున్నారు. పటాకులు పేల్చి స్వీట్లు పంచుతున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. ప్రధానంగా గిరిజన గ్రామాలు, తండాలు, గూడేలు, కాలనీల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. ఆదివారం జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీలు, వార్డులు, పట్టణాల్లో గిరిజనులు సంబురాలు నిర్వహించారు. కేవలం ఒక రాయపర్తి మండలంలోనే పదిహేడు గ్రామాల్లో సీఎం కేసీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రాయపర్తితో పాటు జేతురాంతండా, తెట్టేకుంట తండా, జింకురాంతండా(కే), ఎర్రకుంటతండా, వాంకుడోత్తండా, పన్యానాయక్తండా, జయరాంతండా(ఎస్), బాల్నాయక్తండా, బాలాజీతండా, పానిష్తండా, దుబ్బతండా, గణేశ్కుంటతండా, సూర్యతండా, ఏకేతండా, బంధన్‌పల్లి గ్రా మాల్లో గిరిజనులు ఉత్సాహంగా సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ పదిహేడింటిలో రాయపర్తి, సూర్యతండా, ఏకేతండా, బంధన్‌పల్లి మినహా ఇతర పదమూడు గ్రామాలు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు కావడం విశేషం. ఉద్యమ సమయంలో చెప్పినట్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే గిరిజన గూడేలు, తండాలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి తన మాట నిలబెట్టుకున్నారు.
కొత్తగా ఆవిర్భవించిన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లుగా గిరిజనులే ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు నూత న పంచాయతీలతో గిరిజనులు తమ తండాలు, గూడేలను తామే పాలించుకుంటున్నారు. రాయపర్తిలో ఆర్టీ సీ బస్‌స్టేషన్ వద్ద జరిగిన పాలాభిషేకం కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహనాయక్, నేతలు బిల్లా సుధీర్‌రెడ్డి, పూస మధు తదితరులు పా ల్గొన్నారు. ఇతర గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పాటు టీఆర్ఎస్ మండ ల, గ్రామ కమిటీల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా గిరిజనులు సంబురాలు నిర్వహించారు. ఇక్కడ అంబేద్క ర్ సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆనందంతో స్వీట్లు పంచారు.
మున్సిపల్ చైర్పర్సన్ అరుణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలం లో కొత్త గ్రామ పంచాయతీగా ఆవిర్భవించిన చంద్రుతండలోనూ గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వరంగల్‌లోని కాశీబుగ్గ సెంటర్లో గిరిజనులు సంబురాలు నిర్వహించారు. టీఆర్ఎస్ నేత మోతీలాల్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని తండాలు, గూడేల్లో గిరిజనులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచా రు. పర్వతగిరి మండలంలోని గ్రామాలు, తండాలు, గూడేల్లో సోమవారం భారీ ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు గిరిజనులు సన్నాహాలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం తమ సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని గిరిజనులు మురిసిపోతున్నారు.
గిరిజనులు కేసీఆర్‌కు రుణపడి ఉంటారు..
– పర్వతగిరి జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్
పర్వతగిరి : గిరిజనులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా మాకు జరిగిన అన్యాయాన్ని సీఎం గుర్తించి పది శాతం రిజర్వేషన్లు ప్రకటించడం హర్షణీయం. ఎన్నో ఏళ్ల కల ప్రత్యేక తెలంగాణలో సాకారమైంది. అడగకుండానే ప్రకటించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యావాదాలు.