వరంగల్, డిసెంబరు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార విధుల కన్నా కాంగ్రెస్ నేతలతో సఖ్యతకు ప్రాధాన్యత ఇచ్చిన వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్‌పై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చర్యలకు ఉపక్రమించారు. అజంజాహి మిల్లు కార్మిక భవన్ కబ్జా వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ భర్త కొం డా మురళీధర్‌రావుతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన వ్యవహారంపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు.
ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో విచారణాధికారిగా ఉన్న తహసీల్దార్ ఆరోపణలు ఎదుర్కొంటు న్న కాంగ్రెస్ నేతతో కలిసి ప్రైవేట్ కార్యక్రమంలో పా ల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరుపై వివరణ ఇవ్వాలని ఇక్బాల్‌కు కలెక్టర్ నోటీసు ఇచ్చారు. విచారణ అధికారిగా వెళ్లి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తో కలిసి ప్రెస్మీట్లో పాల్గొనడం ఏమిటని, దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
అజంజాహి మిల్లు కార్మిక భవనం కబ్జా వ్యవహారంలో ఆలస్యంగా అయినా అధికారులు చర్యలు చేపపట్టారు. మంత్రి భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అండదండలతో ఓ ప్రైవేట్ వ్యాపారి అజంజాహి మిల్లు కార్మిక భవన్ కబ్జా కోసం చేసిన ప్రయత్నాలపై ‘నమస్తే తెలంగాణ’ వరుసగా కథనాలను ప్రచురించింది. కలెక్టర్ సత్యశారద ఆదేశాలతో వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ గురువారం కార్మిక భవనం స్థలాన్ని పరిశీలించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు.
ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 75 ఏండ్లుగా కార్మికుల కోసం ఉన్న భవనం కబ్జా పర్వానికి తహసీల్దార్ ఆదేశాలతో తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. 1,450 గజాల భూమిని కార్మికులకు దూరం చేసేందుకు అందులో ఉన్న భవనాన్ని కూల్చి వేసి అక్కడ ఓ వ్యాపారితో కలిసి కొండా మురళీధర్‌రావు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం సోమవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ విషయమై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ కోసం వెళ్లిన తహసీల్దార్ ఇక్బాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. దీంతో మిల్లు స్థలం పరిరక్షణపై కార్మికుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తహసీల్దార్‌కు కలెక్టర్ నోటీసులు జారీ చేయడంప్రాధాన్యతను సంతరించుకుంది.
కాశీబుగ్గ : అజంజాహి మిల్లు కార్మికుల భవనం స్థలం కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు రావడంతో దానిని పరిశీలించాను. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ఉండేందుకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు జారీ చేయగా ఆ వివరాలు తెలిపేందుకు వెళ్లిన క్రమంలో అక్కడ జరుగుతున్న విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. నేను ఉద్దేశపూర్వకంగా పాల్గొనలేదు. కేవలం సమాచారం అందించేందుకు మాత్రమే వెళ్లాను. కార్మికులతో మాట్లాడి ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాను.
– ఇక్బాల్, వరంగల్ తహసీల్దార్