ములుగు, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలతో సంబంధం లేకుండా, భేదభావాలు, తారతమ్యాలు చూపకుండా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ స్పష్టం చేశారు. శనివారం ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు, భద్రాచలం నియోజకవర్గంలోని రెండు మండలాలకు చెందిన 97మంది దళిత బంధు లబ్ధిదారులకు ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీర య్య, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి పంపిణీ చేశారు. తొలుత జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలం చుట్టూ రూ.2కోట్ల 60లక్షల ఐటీడీఏ నిధులతో చేపట్టిన ప్రహరీ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.కోటి 73లక్షల ఐటీడీఏ నిధులతో ఆర్అండ్బీ శాఖ ద్వారా నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహాన్ని ప్రా రంభించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించిన దళిత బం ధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడా రు. నిరుపేదల కష్టం సీఎం కేసీఆర్‌కు తెలుసునని, అందుకే ఆర్థిక సమానత్వం కోసం కృషిచేస్తున్నారని తెలిపారు. యూనిట్లు పొందిన లబ్ధిదారులు మరో పది మందికి ఉపాధి చూపుతూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులో దళిత బంధు యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులు వాహనాలు కాకుండా వినూత్న ఆలోచనలతో రావాలన్నారు. దళితులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో దళితులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకే రూ.10లక్షలతో యూనిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు జట్టుగా ఏర్పడి డెయిరీలు, కిరాణం దుకాణాలు, మద్యం దుకాణాలు, మెడికల్ షాపులు వంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ములుగు జిల్లాలోనూ దళితబంధు లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలకే వదిలేసినట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవీ గణేశ్, ఆర్డీవో రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, రైతుబంధు సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, జడ్పీటీసీలు గై రుద్రమదేవి, పాయం రమణ, ఎంపీపీ రజిత పాల్గొన్నారు.
కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన నియోజకవర్గంలో రూపొందించుకున్న దళితజ్యోతి కార్యక్రమ స్ఫూర్తితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాకు దళిత బంధు పథకాన్ని అందించినందుకు సీఎం కేసీఆర్‌కు జీవిత కాలం రుణపడి ఉంటాం. నాకున్న మూడు ఎకరాల్లో రెండు సీజన్లలో ట్రాక్టర్ కిరాయిలే ఎక్కువగా ఖర్చయ్యేవి. దళిత బంధు ద్వారా పొందిన ట్రాక్టర్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటాం. నేను, నా కొడుకు వ్యవసాయం చేసుకోవడంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో కిరాయికి నడుపుతాం.
– మురుకుట్ల రమణ, నర్సింహసాగర్, మంగపేట మండలం, దళితబంధు లబ్ధిదారు

నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం వర్తించడంతో జీవితాన్ని మార్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ పథకాన్ని రూపొందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. నాకు 70 సెంట్ల భూమి ఉంది. మరికొన్ని ఎకరాలు కౌలుకు సాగు చేస్తాను. ప్రస్తుతం దళిత బంధు ద్వారా వచ్చిన ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు సులువు కానున్నాయి.
– బసరకాని సుక్కయ్య, వెంకటాపురం(నూగూరు) మండలం కొండాపురం, దళితబంధు లబ్ధిదారుడు

దళితబంధు పథకానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను ఎంపికవుతానని కలలో కూడా ఊహించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలు అభివృద్ధి చెందాలని ప్రవేశపెట్టిన ఈ పథకం దళితులకు అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా వచ్చిన ట్రాక్టర్‌ను వ్యవసాయ పనులతోపాటు కిరాయికి నడిపి ఉపాధి పొందుతాను. గతంలో ప్రభుత్వ పథకాలు దక్కాలంటే ఎన్నో పైరవీలు నడిచేవి. అవేవీ లేకుండా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– గుమాస వెంకటాపురం(నూగూరు) మండలం బోదాపురం గ్రామం, దళితబంధు లబ్ధిదారుడు

దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయడం హర్షణీయం. దళితబంధు వంటి పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ సాగు భూములు ఇవ్వడంతోపాటు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి పథకాలతో దళితులు అన్నివర్గాలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
– నద్దునూరి రమేశ్, ములుగు, దళితబంధు లబ్ధిదారుడు

ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాకు గత ప్రభుత్వాల్లో ఏ పథకం వర్తించలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రోజు దళిత బంధు పథకం లబ్ధిదారుడిగా ఎంపికవడం ఎంతో సంతోషం కలిగించింది. నాకు వచ్చిన డిజైర్ కారుతో నేను, నా కొడుకు కలిసి కిరాయిలకు నడుపుతూ జీవిస్తాం. పార్టీలకు సంబంధం లేకుండా పథకాన్ని కేటాయించడం ఆనందంగా ఉంది.
– కొండ ఫణిందర్, వెంకటాపురం(నూగూరు), దళితబంధు లబ్ధిదారుడు

దళిత బంధును అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దళితులు జీవితాంతం గుర్తు చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. దళితులందరూ ఓపికతో విడుతల వారీగా దరఖాస్తు చేసుకొని పథకాన్ని పొందాలని సూచించారు. ప్రావీణ్యం ఉన్న వ్యాపారాల్లో రాణించే అవకాశాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్రమంతటా ఒకే విధానాన్ని పాటించడం అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లానే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ సమానత్వం పాటించారని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభు త్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లయ్యిందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఎంపికచేయడం గొప్ప విషయమన్నారు.
దళితులు గ్రూపులుగా ఏర్పడి వినూత్న ఆలోచనలతో దళిత బంధు పథకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా వ్యాపారాలు నిర్వహించాలని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత సూచించారు. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని, ఎలాంటి పైరవీలు లేకుండా ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామన్నారు. అన్ని కులాలతో దళితులకు సమానంగా అవకాశం కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌ను దళితులు గుండెల్లో పెట్టుకొని ఆరాధించాలని సూచించారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాట్లాడుతూ దళితబంధు పథకం యావత్తు దళితజాతికి వంద శాతం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.