నల్లబెల్లి, జూన్ 4 : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు దేహధారుడ్యం పెంపొందుతుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మూడుచెక్కలపల్లె గ్రామంలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం శనివారం జరిగింది. గ్రామంలో రూ. 4.60 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి క్రీడాకారులతో కొద్దిసేపు ఎమ్మెల్యే వాలీబాల్ ఆడారు. అనంతరం సర్పంచ్ బానోత్ పూల్‌సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.
పల్లెలు సైతం పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, విద్యుత్ దీపాలు, డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతివనాల ఏర్పాటుతో పాటు డైనేజీలు శుభ్రం చేశామన్నారు. అలాగే, కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించుకోడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.
గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లను త్వరలోనే మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మరో రూ.10 లక్షలతో మహిళా బిల్డింగ్ నిర్మాణం, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న ప్రతి రైతుకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, మండల ప్రత్యేకాధికారి జహీరొద్దీన్, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, మండలాధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఏపీవో వెంకటనారాయణ, ఎంపీటీసీ దేవూనాయక్, కార్యదర్శి యాదగిరి, ఎస్సై రాజారాం తదితరులు పాల్గొన్నారు.