కాశీబుగ్గ, జూన్ 4: గ్రేటర్ వరంగల్ పరిధిలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంతో కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. శనివారం వరంగల్ 20వ డివిజన్లోని పద్మనగర్, శాంతినగర్‌లో మేయర్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని అభివృద్ధి పనులను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, కార్పొరేషన్ డీఈలు, ఏఈలు, మెప్మా అధికారులు, ఆర్పీలు, అంగన్వాడీలు, నాయకులు పాల్గొన్నారు. అలాగే, మేయర్ 3వ డివిజన్ పరిధిలోని ఆరెపల్లి, పైడిపల్లిలో పనులను పరిశీలించారు. రూ. 24,75,00,167తో అభివృద్ధి పనులు చేపట్టగా, రూ. 16 కోట్లతో 117 పనులు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. మరో ఆరు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
21 అభివృద్ధి పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. ఆరెపల్లి రామాలయం ప్రాంతంలో కొనసాగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే, పైడిపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మేయర్.. లబ్ధిదారులకు అందజేస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. అలాగే, జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలించి హ్యాండ్‌బాల్‌లో గుర్తింపు పొందిన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.
కరీమాబాద్/గిర్మాజీపేట/వరంగల్‌చౌరస్తా/పోచమ్మమైదాన్/గీసుగొండ/మట్టెవాడ: పట్టణప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ అన్నారు. శనివారం అధికారులతో కలిసి డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే, వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలో కార్పొరేటర్ గుండు చందన పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయుల్బాల్స్ వేశారు. 25వ డివిజన్ నిజాంపురకాలనీలో జీడబ్ల్యూఎంసీ కార్మికులతో డ్రైనేజీలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
డివిజన్ నాయకుడు బస్వరాజ్ శ్రీమాన్ పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో చార్‌బౌళి వాటర్‌ట్యాంక్ ప్రాంతంలో పనులు చేపట్టారు. 33వ డివిజన్లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో డ్రైనేజీల్లో చెత్తను తొలగించారు. వరంగల్ 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్‌కుమార్ ఎల్బీఆర్నగర్, వరంగల్ బస్టాండ్‌లోని పబ్లిక్ టాయిలెట్స్‌లో లోపాలను గుర్తించారు. యాకుబ్పురలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్ వేయాలని, మురుగు కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాలని అధికారులను కోరారు.
అనంతరం గిర్మాజీపేట బాపూజీ విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డివిజన్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వరంగల్ 12వ డివిజన్లోని తుమ్మలకుంట, బాలాజీ సంఘం, ఇతర ప్రాంతాల్లో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ పర్యటించారు. దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు.
15, 16వ డివిజన్ల కార్పొరేటర్లు సుంకరి మనీషా, ఆకుల మనోహర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఇప్పటికే సీసీరోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, లింకు రోడ్లును పూర్తి చేశామన్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు డివిజన్లను ఆదర్శంగా నిలుపుతామన్నారు. 24వ డివిజన్లోని ఎల్లంబజార్, కాశీందుల్లా, షేర్పురా, చమన్‌లో కార్పొరేటర్ ఆకుతోట తేజస్విని-శిరీష్ స్థానికుల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.