వర్ధన్నపేట, జూన్ 4: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సర్కారు బడుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో శనివారం వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి పాల్గొని మాట్లాడారు.
లక్షల రూపాయల ఖర్చుతో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించి ఇబ్బందులకు గురికాకుండా అన్ని వసతులు ఉన్న సర్కారు బడుల్లో చేర్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం, అర్హత కలిగిన ఉపాధ్యాయులు పని చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమారస్వామి, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దుగ్గొండి/నర్సంపేటరూరల్: సర్కారు బడుల బలోపేతానికి గ్రామస్తులు సహకరించాలని నాచినపల్లి సర్పంచ్ పెండ్యాల మమతారాజు కోరారు. మండలంలోని తొగర్రాయి, మందపల్లి, రేఖంపల్లి, వెంకటాపురం, దుగ్గొండి, దేశాయిపల్లిలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ప్రచారం చేశారు.
నాచినపల్లి సర్పంచ్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు దుర్గాప్రసాద్, కర్ణకంటి రామ్మూర్తి, ప్రవీణ్, నాగేశ్వరాచారి, సుధాకర్‌రెడ్డి, జీవన్‌కుమార్, వెంకట్రావు, ఎస్ఎంసీ చైర్మన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన కరపత్రాలు, బ్యానర్లు చేతబూని నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దాసరిపల్లిలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ం శోభన్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ పెండ్యాల శ్రీనివాస్ సమక్ష్యంలో 1వ వార్డు సభ్యుడు పెరుమాండ్ల అనిల్ తన సోదరుడి కుమారుడు రింటును సర్కారు బడిలో చేర్పించారు.
పోచమ్మమైదాన్: వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాలలో శనివారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ ఆదేశానుసారం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు స్పందించారు. శనివారం చార్‌బౌళి పాఠశాలలో ముగ్గురు పిల్లలు అడ్మిషన్లు పొందారు. బడిబాట కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వస్తున్నదని హెచ్ఎం టీ కవిత తెలిపారు. పాఠశాల ప్రారంభంలోగా స్కూల్లో మరిన్ని వసతులు కల్పిస్తే అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ వైఎస్ చైర్మన్ తేజస్విని, ఉపాధ్యాయులు నవీన్‌కుమార్, ఇప్తెకార్ అలీ, రమేశ్, అశోక్, నీరజ, స్వప్న, లక్ష్మి పాల్గొన్నారు.
నల్లబెల్లి/కాశీబుగ్గ/చెన్నారావుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యశించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అర్శనపెల్లి సర్పంచ్ తిప్పని సృజనా లింగమూర్తి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పోశంపల్లె గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్కారు బడులను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగా మనఊరు-మనబడి కార్యక్రమంలో ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం కొలిపాక సంగీత, ఎంపీటీసీ బోల్ల శ్రీలత, కార్యదర్శి మౌనిక, ఎస్ఎంసీ చైర్మన్ బండి ప్రభాకర్, సీఆర్పీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కాశీబుగ్గ ప్రాంతంలోని ప్రభుత్వ నరేంద్రనగర్ (గుడిబడి) ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులు సర్కారు బడుల్లో అడ్మిషన్లు పొందాలని కోరారు. అత్యధిక అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం కుంట రవికుమార్, టీచర్లు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఐదుగురు విద్యార్థులను సర్కారు బడిలో చేర్పించినట్లు హెచ్ఎం శ్రీమతి ఫ్లోరెన్స్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యయులు బాలాజీరావు, సుందర్, రవికుమార్, రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.