పేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగువేసింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి పీహెచ్సీలో ఆరోగ్యమిత్రల ద్వారా 56 రకాల వ్యాధులకు చికిత్సలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి దీనిని అమల్లోకి తేనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యాధికారులకు గురువారం ఒక రోజు ఆరోగ్యశ్రీ సేవలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తి స్థాయిలో విస్తృత పరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది వైద్యాదికారులకు గురువారం ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు గతంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారికి, మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన డాక్టర్‌కు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ నేతృత్వంలో ప్రతి పీహెచ్సీలో ఆరోగ్యమిత్రల ద్వారా 56 రకాల వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తీసుకు రానున్నారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అమల్లోకి తేనున్నారు.
జిల్లాలో పీహెచ్‌సీల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా 56 రకాల వ్యాధులకు చికిత్సఅందించనున్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో పాము, తేలు కాటుతో సహా అత్యంత తీవ్రమైన వ్యాధులను సైతం గుర్తించి సంబంధిత దవాఖానలకు పంపించి మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలతో ప్రజలకు నాణ్యమైన ఔషధాలు అందుబాలోకి రానున్నాయి.
జిల్లాలో జూన్ 2 నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించనున్నారు. ఇందు కోసం జిల్లాలోని 13 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యాధికారులకు గురువారం ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం గతంలో శిక్షణ పొందిన జిల్లా ఉప వైద్యాధికారి నేతృత్వంలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే చిట్యాల సీహెచ్‌సీ, మహదేవపూర్ సీహెచ్‌సీలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమవుతాయి. ప్రజలకు 56 రకాల వ్యాధులకు వైద్య సేవలను అందించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము.
– కొమురయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జయశంకర్ భూపాలపల్లి