రఘునాథపల్లి, మే 25 : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించి వారిని ఆరోగ్యంగా ఉండేలా సర్కారు ప్రోత్సా హం అందిస్తున్నది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వీరికి బాలామృతంతోపాటు కోడిగుడ్లు, పాలు అందిస్తున్నారు. పోషణ్ అభియాన్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తున్నారు. గర్భం దాల్చిన సమయం నుంచి కాన్పు జరిగే వరకు తీసుకోవాల్సిన పోషక ఆహారంపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించి తద్వారా మాతాశిశు మరణాల నియంత్రణకు కృషి చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ గర్భిణిలు, బాలింతలు తక్కువ బరువుతో జన్మించిన శిశువుల వివరాలు సేకరించి పోషకాహార నియమాలపై వివరిస్తున్నారు. ప్రధానంగా జనగామ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 27 సెక్టర్లు ఉన్నాయి. 656 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 39 మిని అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల జిల్లాలోని అన్ని మండలాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు సర్వే చేపట్టారు. దీని ప్రకారం 6 సంవత్సరాలలోపు పిల్లలు 24,905, గర్భిణులు 3,351, బాలింతలు 3,437 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరూ అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్నారు. ప్రతినెల చిన్నారుల బరువును తూకం వేస్తున్నారు. తక్కువ బరువు, రక్తహీనతతో ఉన్న చిన్నారులకు న్యూట్రిషన్ రిహాబిటేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాలు పోషకాహారం అం దిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ 150 గ్రాముల అన్నం, 30 గ్రాములు పప్పు, 16 గ్రాములు నూనె, 200 గ్రాములు పాలు, కోడిగుడ్డు, సాంబారు ఇస్తున్నారు. 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు 75 గ్రాముల అన్నం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాములు నూనె, కోడిగుడ్డు, 20 గ్రాములు కురుకురే ప్యాకెట్ ఇస్తున్నారు. 7 నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు నెలకు మూడు కిలోల బాలామృతం,16 కోడిగుడ్లు ఇస్తున్నారు. తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ప్రత్యేక పోషకాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. చిన్నారులను అంగన్వాడీ సెంటర్లకు రప్పించి వారి తల్లులకు బాలామృతం అందిస్తున్నారు. క్రమం తప్పకుండా వినియోగిస్తే ఉపయోగం ఉంటుందని సూచిస్తున్నారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే పోషకాహారం అందిస్తున్నాం. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలను వివరిస్తున్నం. సర్కారు ఆదేశాలకనుగుణంగా చిన్నారులకు ఆటపాటల్లో ప్రోత్సాహం అందిస్తున్నం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం.
-దుబ్బాక శోభారాణి, అంగన్వాడీ టీచర్, కోడూరు
చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి. నవజాతి శిశువుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధతోపాటు అదనపు ఆహారం అందిస్తున్నాం. పిల్లల పెరుగుదలపై అంచనా వేయడంతో పాటు స్త్రీలలో రక్తహీనతను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగాహన కల్పిస్తున్నాం. తక్కువ బరువుతో జన్మించిన నవజాతి శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నం.
-జయంతి, జిల్లా సంక్షేమ అధికారి