ములుగురూరల్, మే 24 : భానుడి భగ భగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూరీడు సెగలు కక్కుతుండడంతో జనం బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పది రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈ నెల 22, 24న ములుగులో 45 డిగ్రీలకు చేరింది. ఎండ తీవ్రత దృష్ట్యా అవరమైతేనే బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు తమ పనులను వాయిదా వేసుకొని సాయంత్రం వేళల్లో బయటకు వస్తున్నారు.
ఫిబ్రవరి నెలాఖరులో మొదలైన ఎండలు మార్చిలో ఓ మోస్తరుగా కనిపించగా ఏప్రిల్ 15 నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. వారం రోజుల క్రితం 40 డిగ్రీలుగా ఉన్న పగటి ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా 42 నుంచి 45 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతను తట్టుకోలేక పోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలైన కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల మొత్తం రికార్డు స్థాయికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు చల్లదనం కోసం శీతలపానీయాలు, జూస్లు, నిమ్మరసం వంటివి సేవిస్తున్నారు.
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ఎండ నుంచి రక్షణ పొందేందుకు మాస్కులు, టోపీలను ధరిస్తున్నారు. గ్రామాల్లో కరువు పనులకు వెళ్లే ప్రజలు ఉదయం 9 లోపే పనులను పూర్తి చేసుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. నెల 18, 19, 20, 21 తేదీల్లో 38, 39 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రజలు కొంత ఊరట చెందానే. మరుసటి రోజు నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ప్రస్తుతం ఎండలో తిరుగడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారిన పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
మధ్యాహ్నం సమయంలో అవసరం ఉంటేతప్ప బయటికి రావొద్దు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం తప్పుతుంది. నిమ్మరసంతో పాటు ఓఆర్ఎస్ మూడు పూటలా తాగాలి. ఆహారపు అలవాట్లను సైతం కాలానుగుణంగా మార్చుకోవాలి. తప్పనిసరి బయటికి వస్తే తెల్లని రుమాల్తో పాటు గొడుగు, క్యాప్‌ను ధరించాలి. వడదెబ్బకు గురి కాకుండా కొబ్బరి బోండాలు, ఖర్జూర, దోసకాయలు వంటివి తీసుకోవాలి.
– అల్లెం అప్పయ్య, ములుగు డీఎంహెచ్‌వో
తేదీ గనిష్ఠం కనిష్ఠం
17 41 27
18 39 27
19 38 26
20 39 28
21 39 25
22 45 30
23 42 29
24 45 26