కాశీబుగ్గ, మే 24: గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మంగళవారం విత్తనమేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పరిశోధన సంచాలకుడు ఆర్ ఉమారెడ్డి మాట్లాడుతూ ఏటా మే 24న విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ నుంచి విడుదలైన పలు వరి, కంది, పెసర, మినుము రకాలతోపాటు తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ వద్ద ఉన్న వరి, అపరాల, కూరగాయల విత్తనాలను రైతులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
రైతులు వరిలో సన్న రకాలైన సిద్ది, వరంగల్ వరి-2 రకాల కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సన్నాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్త్తున్నదని తెలిపారు. వానకాలంలో పండించే పంటల్లో అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు పలువురు శాస్త్రవేత్తలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
సీహెచ్ దామోదర్‌రాజు వరిలో రకాలు-లక్షణాలు, యు.నాగభూషణం పొలాన్ని దమ్ము చేయకుండా వడ్లు విత్తే విధానం, దమ్ము చేసిన పొలంలో వడ్లను వెదజల్లే విధానం, సంధ్యా కిశోర్ అపరాల సాగులో మెళకువలు, ప్రశాంత్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, సతీశ్‌చంద్ర వరంగల్ నుంచి విడుదలైన వరి రకాలు, సీహెచ్ రాములు వివిధ పంటల్లో సిఫార్స్ ఎరువుల మోతాదు, శ్రవణ్‌కుమార్ వరిలో ఉల్లికోడు యాజమాన్యం, పద్మజ, పలు పంటలను ఆశించే తెగుళ్ల యాజమాన్యం, నర్సయ్య విత్తన ప్రాముఖ్యం గురించి క్లుప్తంగా రైతులకు వివరించారు.
ఈ విత్తన మేళాలో పంటల వారీగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వరంగల్ వరి-1, వరంగల్ వరి-2, రకాల బ్రోచర్స్తోపాటు కందిలో నూతన రకాలు, యాజమాన్య పద్ధతులు అనే బ్రోచర్స్ విడుదల చేశారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ బలరాం, సహాయ సంచాలకులు దామోదర్‌రెడ్డి, జాతీయ విత్తన సంస్థ మేనేజర్ అజయ్‌పాండే, రాష్ట్ర విత్తన అబివృద్ధి సంస్థ మేనేజర్ రఘు పాల్గొన్నారు.