వరంగల్, మే 24: గ్రేటర్ వరంగల్‌లోని ప్రతి డివిజన్లో క్రీడాప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనం, నర్సరీలు ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఆమె పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్షించారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేలా, మానసిక ప్రశాంతత కల్పించడం, భావితరాలు శారీరక దృఢత్వంతో ఎదిగేలా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. మొదటి విడుత పట్టణ ప్రగతిలో గుర్తించిన 24 క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రేటర్ కార్పొరేషన్‌లోని డీపీ, ఎల్పీ నంబర్లలోని ఖాళీ స్థలాల్లో ఉన్న విస్తీర్ణాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. హరితహారంలో భాగంలో ప్రతి డివిజన్లో నర్సరీ ఉండాలన్నారు. గ్రేటర్లో గుర్తించిన 23 స్థలాల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 12 పట్టణ ప్రకృతి వనాలకు తోడు గుర్తించిన మరో 36 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, సిటీ ప్లానర్ వెంకన్న, లీగల్ అధికారి శ్రీనివాస్, డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్‌రెడ్డి, సుష్మ, బషీర్, రిటైర్డ్ డీఈ రవీందర్ పాల్గొన్నారు.
కాశీబుగ్గ/పోచమ్మమైదాన్: భవిష్యత్‌లో ముంపునకు గురికాకుండా డిసిల్టింగ్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగాలని మేయర్ సుధారాణి సూచించారు. 14వ డివిజన్లోని ఎస్ఆర్నగర్, సాయిగణేశ్కాలనీ, బాలాజీనగర్, మధురానగర్, లక్ష్మీగణపతికాలనీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డివిజన్లో కొనసాగుతున్న అభివృద్ధి, డిసిల్టింగ్ పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వర్షకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆమె వెంట కార్పొరేటర్ తూర్పాటి సులోచన, డీఈ రవికిరణ్, ఎఈ కార్తీక్‌రెడ్డి, కృష్ణమూర్తి, శానిటరీ ఇనెస్పెక్టర్లు ఎల్లాస్వామి, ఇస్రం, శ్రీను, జవాన్లు పాల్గొన్నారు. అలాగే, వరంగల్ 22వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మేయర్ పర్యటించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముంపు ప్రాంతాలైన ఎల్బీనగర్, దేశాయిపేట మెయిన్ రోడ్డు, మర్రివెంకటయ్య కాలనీ, 80 ఫీట్లరోడ్డు, ఫిల్టర్‌బెడ్, వినాయక వీధి, రామనాథపురి, పృథ్వీనగర్, శాంతినగర్‌ను సందర్శించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎల్బీనగర్ సిటీప్యాలెస్ నుంచి పద్మావతి కాలేజీ వరకు, దేశాయిపేట మెయిన్‌రోడ్డు నుంచి మర్రివెంకటయ్య కాలనీ, 80 ఫీట్లరోడ్డులోని బాక్స్ డ్రైనేజీని పరిశీలించారు. మురుగుకాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని ఆదేశించారు. మేయర్ వెంట కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి ఉన్నారు.