నర్సంపేట, మే 24: పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి కరోసా కల్పిస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని 150 మంది లబ్ధిదారులకు రూ. 47 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని అనేక వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీ లెటర్ ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం చేయించుకోవచ్చని సూచించారు.
తెల్లరేషన్‌కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న పేదలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. చికిత్సకు సంబంధించిన బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందుతుందని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో నర్సంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉందని గుర్తుచేశారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 50 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖానాపురం: మండలంలోని మంగళవారిపేటకు చెందిన కడెం నాగరాజుకు రూ. 35 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, సర్పంచ్ లావుడ్యా రమేశ్‌నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నాగరాజు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో అతడు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా , ప్రభుత్వం రూ. 35 వేలు మంజూరు చేసిందన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో రామసహాయం ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: మండలంలోని భోజ్యానాయక్తండాకు చెందిన అజ్మీరా భద్రుకు రూ. 41 వేలు, అజ్మీరా పాపమ్మకు రూ. 60 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు భూక్యా వీరూనాయక్, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, వల్గుబెల్లి ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రవీందర్, రాంబాబు పాల్గొన్నారు.
దుగ్గొండి: ప్రజా ఆరోగ్యమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని టీఆర్ఎస్ నాయకుడు ముదురుకోల కృష్ణ అన్నారు. చలపర్తి గ్రామానికి చెందిన నల్ల తిరుపతిరెడ్డికి రూ. 24 వేలు, నల్ల రాంరెడ్డికి రూ. 26 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. సర్పంచ్ శారద ఆధ్వర్యంలో బాధితులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు పోలోజు లక్ష్మణాచారి, దండు రాజు పాల్గొన్నారు.