పర్వతగిరి, మే 24: దేశం గర్వించేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కల్లెడలో బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు.
గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని కొనియాడారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్అండ్బీ రోడ్ నుంచి ముంజాలకుంటతండా వరకు రూ. 60 లక్షలు, కల్లెడ ఆర్అండ్బీ రోడ్ నుంచి ఆవకుంటచెరువు వరకు రూ. 77 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ నుంచి చెక్‌డ్యాం వరకు రూ. 55 లక్షలు, గుంటూరుపల్లి నుంచి చెరువుముందుతండా వరకు రూ. 80 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్ కల్లెడ నుంచి ముంజాలకుంటతండా వరకు రూ. 4.30 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమలా పంతులు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, గొర్రె దేవేందర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, ఆర్డీఎఫ్ చైర్మన్ ఎర్రబెల్లి రామ్మోహన్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లెపాటి శాంతిరతన్‌రావు, చింతపట్ల సోమేశ్వర్రావు, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ చిన్నపాక శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, సర్పంచ్‌లు శోభా పరమేశ్వర్రావు, రమేశ్‌నాయక్, తౌటి దేవేందర్, నాయకులు వెంకటేశ్వర్రావు, పరమేశ్వర్రావు, బొట్ల మధు, మాధవరావు, ముస్తఫా, చింతల శ్రీనివాస్, జంగా సాంబయ్య, రతన్‌బాబు, నర్సయ్య, వెంకన్న, రంగయ్య, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
సంగెం: గవిచర్ల గ్రామంలోని గుండ బ్రహ్మయ్య ఆలయానికి మంత్రి ఎర్రబెల్లి నిధులు మంజూరు చేసినట్లు ఆలయ చైర్మన్ కొంతం యాదగిరి తెలిపారు. మంగళవారం గవిచర్లను సందర్శించిన మంత్రిని ఆలయ చైర్మన్‌తోపాటు పలువురు కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు వెంటనే ఆలయాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు.
ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌కు మంత్రి తెలిపినట్లు చైర్మన్ వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన మంత్రికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఆలయ వైస్ చైర్మన్ కూస వెంకన్న, వక్కల శ్రీను, ఎల్లాగౌడ్, సర్పంచ్ దొనికెల రమ-శ్రీనివాస్, ఉప సర్పంచ్ యాకయ్య, మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట: ఉప్పరపల్లికి చెందిన బొడ్డుపల్లి సాయిలు(80) మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్యం చెప్పారు. అనంతరం సాయిలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, నాయకుడు అంజన్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పర్వతగిరి: ఆయన జనాన్ని చూస్తే మంత్రి అన్న విషయాన్నే మర్చిపోతారు. జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. వాళ్లతో మమేకం అయిపోతారు. ఆయనే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. మండలంలో మంగళవారం పర్యటించిన ఆయనకు తురకల సోమారం గ్రామం శివారు నల్లకుంటతండా వాసులు ఉపాధి పనుల్లో భాగంగా చెరువులో పూడికతీత పనులు చేస్తూ కంటపడ్డారు. ఆ దృశ్యాన్ని చూసిన మంత్రి వెంటనే కాన్వాయ్ దిగి కూలీల దగ్గరకు వెళ్లారు. వారిని ఆప్యాయంగా పలకరించి గడ్డపార పట్టి మట్టిని తవ్వి వారిని ఉత్సాహపరిచారు.