నర్సంపేట, 24: దళితబంధు పథకం దళితుల్లో ఆనందం తెచ్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని దళిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. దళితులకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకం కింద రూ.10లక్షల చొప్పున అందుకున్న వారు ఎంతో సంబుర పడుతున్నారు. దళితబంధు పథకంలో వచ్చిన యూనిట్లతో దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారబోతున్నాయి. నర్సంపేటలో తొలివిడతలో 55 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం మంగళవారం పండుగలా జరిగింది.
నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, నర్సంపేటల్లో మండలానికి ఒకటి చొప్పున ఆరు గ్రామాల్లో, నర్సంపేట పట్టణంలోనూ దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారికి ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, కార్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, లబ్ధిదారులు కోరిన యూనిట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్నట్లు తెలిపారు.
నర్సంపేటలో తొలివిడత వంద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రూ.10కోట్ల విలువైన యూనిట్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. రెండో దశలో 1500 మందికి త్వరలోనే పంపిణీ చేయడానికి సిద్ధం అవుతున్నామని తెలిపారు. దళిత బంధు యూనిట్లు పొందిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆ యూనిట్‌ను అమ్ముకుంటే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ గోపి, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్, జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ వైస్‌చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.