వరంగల్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలో మత రాజకీయాలు పెచ్చు మీరుతున్నాయని, దళితులపై దాడులు పెరిగాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్, మాలోత్ కవిత, గండ్ర జ్యోతి, పాగాల సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ దేశంలో మోదీ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏ ఒక్క వర్గానికీ దేశంలో న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అందుకు సీఎం కేసీఆరే సరైన నాయకుడని అరూరి స్పష్టం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులు, మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, రైతులపై చిన్నచూపు, ఉద్యోగులపై మొండి వైఖరి.. ఇలా మోదీ పాలనలో అన్ని వర్గాల వారు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమన్నారు.
దేశంలో విద్వేషాల విషం చిమ్ముతున్న బీజేపీకి విరుగుడు సీఎం కేసీఆరేనని, తక్షణమే ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరారు. మోదీ, బీజేపీ దౌర్జన్యాల నుంచి దేశాన్ని కాపాడే రక్షకుడిగా కేసీఆర్ నిలవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ సంపదను పేదలకు పంచిపెట్టాలన్నా, తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలన్నా, రైతులకు ఉచిత కరంటు ఇవ్వాలన్నా సీఎం కేసీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సంఖ్యా బలం ముఖ్యం కాదని, సంకల్ప బలం ముఖ్యమని, అది సీఎం కేసీఆర్‌కు ఉందని అరూరి పేర్కొన్నారు.