సంపదను సృష్టించి పేదలకు పంచాలన్న రాష్ట్ర సర్కారు సంకల్పం నెరవేరుతున్నది. గొల్ల కురుమలకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీతోపాటు అనేక రకాలుగా చేయూతనిస్తుండడంతో ఏటేటా ఆదాయం పెరిగి ఆయా కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ కసరత్తు చేస్తున్నది. జిల్లాలో 1024 చెరువులు, కుంటల్లో 4.6 కోట్ల చేప పిల్లలను వదలనుండగా, ఈ నెల మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ మొదలు కానున్నది.
జిల్లాలో ప్రస్తుతం 163మత్స్య సహకార సంఘాల్లో 10,982మంది సభ్యులుగా ఉన్నారు. గ్రామ పంచాయతీ చెరువులు కూడా మత్స్యశాఖ ఆధీనంలోకి రావడంతో కొత్తగా మరో 35 సంఘాల ఏర్పాటుకు అధికారులు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15 సంఘాల్లో సభ్యుల ఎంపిక పూర్తి కాగా, మరో 20 సంఘాల్లో సభ్యుల కోసం పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే కొత్తగా మరో 700 మంది సభ్యులకు ఉపాధి లభించనుంది.
బయ్యారం, జూలై 31: మత్స్యకారుల సంక్షేమాని కి రాష్ట్ర సర్కారు తీవ్రంగా కృషి చేస్తున్నది. 2015వ సంవత్సరం నుంచి ఏటా నూరుశాతం రాయితీతో చెరువుల్లో చేపపిల్లలను వదిలి వారి ఆర్థికాభివృద్ధికి బా టలు వేస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకోగా, మత్స్యశాఖ చేప పిల్లలను వదిలేందుకు సిద్ధమైంది.
జిల్లాలో 1024 చెరువులు, కుంటల్లో ఈ ఏడా ది 4.6 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ మొదలు కానున్నది. ఇందులో దీర్ఘకాలిక నీటి వనరులున్న 296 చెరువుల్లో 80MM నుంచి 100MM సైజు కలిగిన చేప పిల్లలు 2.23 కోట్లు, స్వల్పకాలిక నీటి వసతి కలిగిన 728 చెరువులు, కుంటల్లో 1.83కోట్ల 35MM నుంచి 40MM సైజు కలిగిన చేప పిల్లలను సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 163మత్స్య సహకార సంఘాల్లో 10,982మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 136 సంఘాల్లో 9,555 మంది, 11 గిరిజన పారిశ్రామిక సంఘాల్లో 606 మంది, 16 మహిళా పారిశ్రామిక సంఘాల్లో 821మంది ఉన్నారు. అయితే ఇటీవల గ్రామ పంచాయతీ చెరువులు సైతం మత్స్యశాఖ ఆధీనంలోకి రావడంతో కొత్తగా మరో 35సంఘాల ఏర్పాటు కానున్నాయి. గతంలో గ్రామ పెద్ద మనుషులు, అధికారులు సూచించిన వారికి సొసైటీల్లో సభ్య త్వం ఇచ్చేవారు. కానీ, ఇటీవల ప్రభుత్వం నూతన నిబంధనలు తీసుకొచ్చింది.
సభ్యులుగా చేరాలనుకునే వారు తప్పని సరిగా 5 వృత్తి నైపుణ్య పరీక్షలు నెగ్గాల్సి ఉంటుంది. ఈత కొట్టటం.., వల విసరడం.., వల అల్ల టం.., లాగుడు వల.., తెప్పపై నుంచి వల వేయడం వంటి పరీక్షలు నెగ్గిన వారికే సభ్యత్వం ఇస్తున్నారు. కాగా, ఇప్పటికే 15 సంఘాలకు పరీక్షలు పూర్తి కాగా, మరో 20 సంఘాలకు వృత్తి నైపుణ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. 35 సంఘాలు ఏర్పాటయితే మరో 700 మంది సభ్యులు పెరిగే అవకాశం ఉంది. మత్స్య పరిశ్రమ ద్వారా ఆదాయం వస్తుండటం, ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడం, ద్విచక్రవాహనాలు, ఫోర్ వీలర్లు అందిస్తుండడంతో సొసైటీల్లో సభ్యులుగా చేరేందుకు ప్రజలకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని చెరువు, కుంటలు మత్స్యసాగుకు అనుకూలంగా ఉన్నా యి.
గతంలో చెరువులు, కుంటల్ల్లో పచ్చిరొట్ట, గుర్రపు డెక్క, అల్లుకునే తీగలతో నిండి చేపల పెంపకానికి అనువుగా ఉండేవి కావు. రాష్ట్ర సర్కారు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతు, పూడికతీత వంటి పనులు చేయించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అటు రైతులకు ఇటు మత్స్యకారులకు అనుకూలంగా మారాయి. ఒకప్పుడు చేపలు తినాలంటే ఆంధ్రా నుంచి వచ్చే చేపల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ప్రభుత్వమే రాయితీలు కల్పిస్తూ చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పుష్కలంగా చేపలు దొరుకుతున్నాయి. మన అవసరాలకు పోను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఏడాది 1024 చెరువులు, కుంటల్లో 4.6 కోట్ల చేప పిల్లలను సిద్ధంగా ఉంచాం. జిల్లాలో ప్రస్తు తం 163 సహకార సం ఘాల్లో 10,982 మంది సభ్యులుండగా మరో 35 సంఘాల ఏర్పాటుకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. మరో 700 మందికి ఉపాధి లభించనుంది.
– అల్లు నాగమణి, జిల్లా మత్స్యశాఖ అధికారి