మహబూబాబాద్, జూలై 31: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి నాయకులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది కృషి చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ పారిశుధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. జీపీ సిబ్బందితో ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. నీరు నిల్వకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో చైర్మన్లు, అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఆదివారం మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటల 10 నిమిషాల కార్యక్రమానికి అనూ హ్య స్పందన వచ్చింది. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇంటి పరిసరాల్లోని చెత్తను, నీటి నిల్వలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో శానిటరీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొనాలని మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి సూచించారు. ఆదివారం తన నివాసంలోని గార్డెన్లో పూల కుండీల్లో చెత్త, టైర్లలో నిలిచిన నీటిని తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో ప్రతిఒక్క రూ ఇళ్లలో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. ఇంటి ఆవరణతో పాటు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను మున్సిపల్ వాహనాల్లో వేయాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ క్రాంతి, జవాన్ వీరస్వామి పాల్గొన్నారు.
డోర్నకల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ము న్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. ఆదివారం ఉదయం 10: 10 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో కూలర్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఇండ్లల్లో కూలర్, కొబ్బరి బోండాలు, పాత టైర్లలో నిల్వ నీటిని వెంటనే తొలగించాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే వ్యాధులు దరిచేరవని, ప్రజలు శుభ్రత పాటిస్తూ, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ అహ్మద్, మున్సిపల్ సిబ్బంది గౌస్ ఖాన్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు అన్నారు. ఆదివారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చైర్మన్, కమిషనర్‌తో పాటు కౌన్సిలర్లు ప్రజలతో కలిసి నీటి గుంతలు, ఇండ్ల చుట్టూ, పాత డ్రమ్ము, కుండలు, తొట్టె, టైర్లలో నిలిచిన నీటిని తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉన్న గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్‌కు తరలించాలని, కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సిబ్బందికి సూచించారు. ప్రతి ఒకరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఏఈ రంజిత్, కౌన్సిలర్లు డీ రేవతి శంకర్, డీ సునీతా జైసింగ్, ఎన్ గజానంద్, కే శంకర్, కే నాగజ్యోతి-నాగరాజు, బీ మాధవీ అనిల్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ జలీల్ వార్డు పరిధిలోని డ్రమ్ముల్లో నిల్వ నీటిని తొలగించి, ప్రజలకు అవగాహన కల్పించారు.
కేసముద్రం: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అమినాపురం సర్పంచ్ పురం రాజమణి అన్నారు. ఆదివారం అర గంటపాటు తమ ఇంటిని శుభ్రం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పిలుపుమేరకు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటున్నానని, ప్రజలు సైతం తమ ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా మార్చుకోవాలన్నారు. నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.