మనసున్న మనిషి మన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆశ కార్యకర్తల సేవలను గుర్తించి జీతాలను పెంచారు’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆశ కార్యకర్తలు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని, ఫీవర్ సర్వే సక్సెస్ చేశారని అభినందించారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అనుబంధ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశవర్కర్ల) సంఘం జిల్లా ప్రథమ మహాసభ ఆదివారం జరిగింది. హాజరైన మంత్రి మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు జీతం కోసం పోరాడితే గత ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని, సీఎం కేసీఆర్ మాత్రం రూ.1500 నుంచి రూ.9,750కి పెంచారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.4వేలకు మించి ఇవ్వడంలేదని మంత్రి ఎద్దేవా చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాజయ్య, శంకర్‌నాయక్, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి హాజరయ్యారు.
జనగామ, జూలై 31 (నమస్తే తెలంగాణ): మనసు న్న మనిషి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆశ వర్కర్లు మరింత బాగా పనిచేసి ఆయన మదిలో చెరగని స్థానం సంపాదించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ టీఆర్ఎస్కేవీ అనుబంధ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశ వర్కర్ల) సంఘం జనగామ జిల్లా ప్రథమ మహాసభను జ్యోతి వెలిగించి పారంభించారు.
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టి.రాజయ్య, శంకర్‌నాయక్, చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి హాజరయ్యారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం ఆధ్వర్యంలో ఆశవర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి అధ్యక్షతన జరిగిన మహాసభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించా రని, ఫీవర్ సర్వేను విజయవంతం చేశారని ఆశకార్యకర్తల సేవలను కొనియాడారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న ఆలోచనకు ఆశ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలో 27వేల మంది ఆశ కార్యకర్తలు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సీఎం కేసీఆర్ స్మార్ట్ ఫోన్లు అందించారని పేర్కొన్నారు. గతంలో ఆశ వర్కర్లు జీతం కోసం పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని, మనసున్న మహారాజు కేసీఆర్ మాత్రం జీతాలను రూ.9,750కి పెంచారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆశాల గౌరవ వేతనం రూ.1500 మాత్రమే ఉండగా, ఇన్నేళ్లలో రూ.8,250 పెరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఆశవర్కర్లకు కేవలం రూ.4వేలు, బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో కేవలం రూ.3వేలు మాత్రమేనని ఇస్తున్నారని వివరించారు.
గతంలో మూడు నెలలకు ఒకసారి జీతాలు వచ్చేది గగనమే, కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తారీఖున ఆశాలకు జీతాలు ఇస్తున్నదని తెలిపారు. వరంగల్, హనుమకొండ సహా జనగామ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా చేశారని, వందశాతం పూర్తి చేసి ఉమ్మడి జిల్లాకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సహా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణుల సంక్షేమంపై ఆశాలు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల ఆరోగ్యం ఆశ వర్కర్ల చేతుల్లో ఉందని, ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు పెరగాలని సూచించారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు త్వరలో ఎన్సీడీసీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్లు అందజేస్తామని, ప్రజారోగ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉందన్నారు. మోదీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉందని, మనం మూడు నుంచి మొదటి స్థానంలోకి వెళ్లేందుకు కృషి చేద్దామని మంత్రి అన్నారు. ఆశ వర్కర్ల సమస్యలు ఏమైనా ఉంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.