మట్టెవాడ, జూలై 31: నగరవ్యాప్తంగా ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొని పరిసరాల శుభ్రతపై ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. ఇందులో మేయర్ గుండు సుధారాణి 29వ డివిజన్లోని కుంటి భద్రయ్య ఆలయం వద్ద కమిషనర్ ప్రావీణ్యతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల శుభ్రతతోనే వ్యాధులు దూరం అవుతాయని తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 10 వారాలపాటు మహానగరంలోని 66 డివిజన్లలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో దోమలు, ఈగల ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇంటి ఆవరణలో ఉండే చెత్తకుండీలు, డబ్బాలు, కూలర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు అందించి ఇంటింటికీ స్టిక్కర్లు అంటించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కరీమాబాద్/వరంగల్‌చౌరస్తా/గిర్మాజీపేట/పోచమ్మమైదాన్/ఖిలావరంగల్: పరిసరాల శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన అన్నారు. 32, 39, 40, 41, 42 డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. యాకుబ్పురలో 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్‌కుమార్ ఆరోగ్య సూత్రాలను సూచించే కరపత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేసి అవగాహన కల్పించారు.
ఇంటి ఆవరణ, ఖాళీ స్థలాల్లో నీరు నిలిచిన చోట ఆయిల్‌బాల్స్ వేయాలన్నారు. 25, 26, 33 డివిజన్లలో కార్పొరేటర్లు బస్వరాజు శిరీషాశ్రీమాన్, బాలిన సురేశ్, ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా లక్షణాలు ఉంటే దగ్గరలోని పీహెచ్‌సీని సంప్రదించాలని కోరారు.
12వ డివిజన్ దేశాయిపేటలో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండొద్దని, ఓవర్‌హెడ్ ట్యాంకు పైన విధిగా మూతలు పెట్టుకోవాలని సూచించారు. 13వ డివిజన్లో కార్పొరేటర్ సురేశ్కుమార్జోషి, 21వ డివిజన్లో ఎండీ ఫుర్ఖాన్, 22వ డివిజన్లో బస్వరాజు కుమారస్వామి పర్యటించారు.
38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలకుండా ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రావుల రాజేశ్, కుక్కల రాజు, పెసరు నిఖిల్, జవాన్ కుమారస్వామి పాల్గొన్నారు.