వరంగల్ చౌరస్తా, జూలై 31: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ తపాలా శాఖ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాసరచన, లేఖ రచన పోటీలు నిర్వహించడంతోపాటు ఆగస్టు 15 నాటికి ప్రతి ఇంటికీ ‘హర్ ఘర్ తిరంగ్’ కార్యక్రమం ద్వారా జాతీయ జెండాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 12వ తేదీ వరకు 1.20 కోట్ల జెండాలను అన్ని పోస్టాఫీసుల్లో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులు విధిగా 200 రూపాయలతో ఫిలోటరీ ఖాతాను కలిగి ఉండాలనే షరతు విధించింది. ఈ ఖాతాదారులకు రూ. 190 విలువ కలిగిన స్టాంపులు, పోస్టల్ ఆర్డర్స్‌ను ఉచితంగా అందిస్తారు. లేఖ రచన పోటీలను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటి విభాగం 18 ఏళ్లలోపు వారికి, రెండో విభాగం 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వేర్వేరుగా ‘విజన్ ఆఫ్ ఇండియా 2047’ అంశంపై వారివారి అభిప్రాయాలతో ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో లేఖ రచన పోటీలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ లేఖలను ‘చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్’ తెలంగాణ, హైదరాబాద్ పేరున వచ్చే అక్టోబర్ 30లోగా చేరేలా పోస్ట్ చేయాలి. ఇందులో నలుగురిని ఎంపిక చేస్తారు. జూనియర్, సీనియర్ విభాగాల నుంచి ఇద్దరిద్దరిని ఎంపిక చేసి వారికి రూ. 25 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తారు.
ఈ పోటీలకు 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ పరీక్ష ఆంగ్లం, హిందీ, స్థానిక భాషల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 26. సెప్టెంబర్ 11న హైదరాబాద్‌లో రాతపరీక్ష నిర్వహిస్తారు. 50 మార్కులకు నిర్వహించనున్న ఈ పరీక్షలో కరంట్ అఫైర్స్, చరిత్ర, భూగోళశాస్త్రం, సామాన్యశాస్త్రం, క్రీడలు, సంస్కృతి, లోకల్ ప్రివిలేజ్, నేషనల్ ప్రివిలేజ్ అంశాలపై రాతపరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు సంవత్సరకాలంపాటు నెలకు 500 రూపాయల నగదు అందిస్తారు.