కరీమాబాద్, జూలై 31: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నది. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు అందిస్తూ భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఇందులో కురుమకుల ఇలవేల్పు అయిన శ్రీబీరన్నస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
గ్రేటర్ వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ బీరన్నకుంటలోని ఈ ఆలయంలో చేపట్టిన పనులతో నూతన శోభ సంతరించుకుంది. లక్షల రూపాయలతో ఆలయ ఆవరణలో సీసీ వేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాకాలం వస్తే చాలు.. ఆలయ ఆవరణ బురదమయంగా మారేదని, సీసీ నిర్మాణంతో బురదకు చెక్ పడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.