భూపాలపల్లి రూరల్, జూలై 30 : రక్తహీనత కలిగిన కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యా అధికారి, పిరమల్ ఫౌండేషన్‌తో రక్తహీనత ఉన్న కిశోర బాలికలను గుర్తించి పౌష్టికాహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో 222 మందిని గుర్తించామని, వీరికి ఇప్ప లడ్డు, పల్లి పట్టిలు అందజేసినట్లు చెప్పారు. వీటిని ఐటీడీఏ ఉట్నూర్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి తీసుకున్నట్లు తెలిపారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌లో పిరమల్ ఫౌండేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రక్తహీనతను నిర్మూలించేందుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జిల్లాలో 55 మంది పిల్లలకు ఐరన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించి ఐరన్ మాత్రలు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో శ్రీరామ్, జిల్లా సంక్షేమ అధికారి, సీపీవో సామ్యూల్, పిరమల్ ఫౌండేషన్ టీమ్ సభ్యులు సౌమ్య, లోకేష్, సచిన్, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటరు కార్డుకు ఆధార్‌ను స్వచ్ఛందంగా అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల సం ఘం 6,7,8,8ఎ ఫారంలో మార్పులు, చేర్పులు చేసిందని, 6బి ఫారం ద్వారా కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు కార్డుకు ఆధార్‌ను అనుంసంధానం చేసుకోవచ్చని తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.