హనుమకొండ, జూలై 30 : ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. ఓటరు నమోదు ఫారం సవరణపై శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిథులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు దరఖాస్తులో ఆధార్ నంబర్ కోసం కొత్త ఆప్షన్ చేర్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు ఫారం 6బీ ద్వారా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఓటర్లకు ఆధార్ కార్డు లేకపోతే 6బీలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా కాపీని ఓటరు అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
ఆధార్ నంబర్ అందించకుంటే ఓటరు జాబితా నుంచి తొలిగిస్తారని తెలిపారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజక వర్గంలోని ప్రజలు పారం 6బీ ద్వారా ఆధార్ అథెంటికేషన్‌ను ఆన్లైన్ ద్వారాగాని, బీఎల్వోలు ఇంటికి వచ్చినపుడు ఆఫ్‌లైన్ ద్వారా గాని చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఆర్డీవో ఎం వాసుచంద్ర, కాంగ్రెస్ నుంచి ఈవీ శ్రీనివాసరావు, బీజేపీ నుంచి రావు అమరేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి సింగారపు రాజ, టీడీపీ నుంచి శ్యాంసుందర్, టీఆర్ఎస్ నుంచి ఇండ్ల నాగేశ్వర్రావు, ఎంఐఎం నుంచి సయ్యద్ ఫైజల్, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది వరలక్ష్మి, సమ్మక్క, అన్వేశ్ పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని హనుమకొండ, కాజీపేట, వర్ధన్నపేట మండలాల పరిధిలోని బీఎల్వోలు, ఎన్నికల విభాగం అధికారులతో శనివారం హనుమకొండ ఆర్డీవో ఎం వాసుచంద్ర సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన నూతన మార్గదర్శకాలను వారికి వివరించారు.
ఇక నుంచి 17 సంవత్సరాలు దాటిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. సంవత్సరానికి మూడు సార్లు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరు ఆధార్ కార్డు వివరాలు సేకరించాలన్నారు. హనుమకొండ తహసీల్దార్ జీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.