వర్ధన్నపేట, జూలై 30 : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నిటినీ సత్వరమే పూర్తి చేయించేందుకు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదేశించారు. శనివారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులతో మున్సిపాలిటీ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు, గిరిజన తండాలు, దళిత కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని సత్వరమే పూర్తి చేయించాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, మెటల్ రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని అధికారులు, గుత్తేదారులకు స్పష్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, రామకృష్ణ, రవీందర్, అన్వర్, ఆంగోత్ భిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.