మహబూబాబాద్ రూరల్, జూలై 30: వసతి గృహాల్లో తప్పనిసరిగా మెనూ పాటిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని శనివారం ఆయన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి సందర్శించారు. వంట గది, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్‌లు, విద్యార్థుల బెడ్లు, తరగతి గదులను పరిశీలించారు.
విద్యార్థుల కోసం ఉదయం వండిన కిచిడీ మొత్తం డ్రైనేజీ దగ్గర పడేసి ఉండడం, మరుగుదొడ్ల వద్ద దుర్వాసన, చెత్త చేరి ఉండడంతో హాస్టల్ వార్డెన్ రోజాలీనా, వర్కర్లుపైన మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులు 9మంది అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్నా పట్టింపు లేదా?, ఇంతజరిగినా పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడమేంటి? ఇంత నిర్లక్ష్యం పనికి రాదంటూ ఏటీడీవో సత్యవతిని మందలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత పాలకులు విద్యార్థుల అవసరాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో హాస్టళ్లలో సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. స్టోర్‌రూమ్‌లో సరుకులు శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ప్రతి రోజూ నాణ్యమైన, రుచికర భోజనం అందించాలన్నారు.
శుభ్రత పాటించక పోవడం వల్లే విద్యార్థులకు సమస్యలు తలెత్తున్నాయన్నారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, నీటిని టెస్టింగ్ చేయించాలన్నారు. హాస్టల్ విద్యార్థుల అస్వస్థతకు కారణం, మెనూ పాటించకపోవడం వంటి అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి రిపోర్ట్‌ను అందించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎర్రయ్య, కలెక్టర్ శశాంకను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్ ఉన్నతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం వసతి గృహాల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నదని, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
విద్యార్థులపై బాధ్యతారహితంగా ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండి బాగా చదువుకోవాలని, ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారులకు తెలియచేయాలన్నారు. హాస్టల్ వార్డెన్, అధికారులు తప్పనిసరిగా నైట్ టైమ్‌లో హాస్టల్లో స్టే చేయాలన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి మంత్రి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, నాయిని రంజిత్ కుమార్, యాళ్ల మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల వార్డెన్ రోజాలీనా సస్పెండ్ చేయడంతోపాటు వంట వర్కర్లను పక్కన పెట్టామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎర్రయ్య శనివారం రా త్రి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన వర్కర్లు ఏర్పా టు చేసి, తాగునీటి వసతిని మెరుగుపరుచడంతోపాటు హాస్టల్ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటామన్నారు.