హనుమకొండ, జూలై 1 : జాతీయ రహదారులు, ఆర్వోబీల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డాక్టర్ బీ గోపితో కలిసి జాతీయ రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై శుక్రవారం ఆయన కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జాతీయ రహదారులు మంజూరు చేసిందన్నారు. రహదారులతోనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. మామునూరు ఏరోడ్రమ్‌కు సంబంధించిన భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నాగ్‌పూర్, విజయవాడ జాతీయ రహదారి 75 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని, ఈ ప్రాధాన్యం దృష్ట్యా జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించి, పూర్తి చేయాలని తెలిపారు. కాజీపేట, బల్లార్షా మూడో రైల్వే పనులు పూర్తి చేయాలన్నారు.
రహదారుల మధ్యలో అడ్డుగా ఉన్న వివిధ నిర్మాణాలను తొలగించాలన్నారు. రైల్వే పరిధిలోని పనుల్లో వేగాన్ని పెంచేందుకు అధికారులతో క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించాలని సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, ఎలతుర్తి జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో కూడా జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.
జాతీయ రహదారి పనుల్లో ఏవైనా పరిపాలనాపరమైన అనుమతులకు తక్షణమే సంబంధిత అధికారులు తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మాట్లాడుతూ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, శ్రీ వత్స, జాతీయ రహదారుల ప్రతినిధి కృష్ణ ప్రసాద్, ఆర్డీవోలు మహేందర్ జీ, వాసుచంద్ర, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.