ఐనవోలు, జూన్ 4 : టీఆర్ఎస్ రైతు సంక్షేమ ప్రభుత్వం అని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. జిల్లాలో ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని కుడా నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ జారీ చేసిన విషయం వస్తావమేనని, రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే అరూరి ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ల్యాడ్ పూలింగ్ను రద్దు చేయించి సీఎస్ సోమేశ్‌కుమార్‌తో ఉత్తర్వులు జారీ చేయించారని చెప్పారు.
మే 31న పెరుమాండ్లగూడెం గ్రామానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులు కోరారు. ల్యాడ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు విషయమై ఎమ్మెల్యే రైతులకు స్పష్టత ఇచ్చారని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ఉండదనే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నాం అన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన వీడాలన్నారు. రైతు శ్రేయస్సుకు పాటుపడుతున్నాం.. రైతుల పొట్టకొట్టే ప్రసక్తి లేదన్నారు. రైతులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల మాటాలు నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అమలవుతున్న ఒక్క సంక్షేమ పథకం ఉందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ జనరంజక పాలనను చూసి ఓర్వలేకనే విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు. వరంగల్‌లో నోటిఫికేషన్ రద్దు అయిన తర్వాత కూడా అసత్య ప్రచారం చేస్తూ, నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని కుట్ర చేస్తున్నారన్నారు. నల్ల చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో ధర్నా చేసిన రైతుల పైకి మంత్రి కొడుకు కార్లు ఎక్కించి చంపించిన బీజేపీ రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడాలన్నారు.
నోటిఫికేషన్ రద్దు అయ్యే వరకూ నిరంతరం పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆయన ఎదుగుదలను ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ రద్దుపై అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఉస్మాన్అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వైస్ ఎంపీపీ మోహన్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జయపాల్, సర్పంచ్ రజిత, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యుడు సంపత్‌కుమార్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు