పోచమ్మమైదాన్, జూన్ 11: కవులు, రచయితలు, సాహితీవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఐఎంఏ హాల్లో సాహిత్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఆర్డీవో మహేందర్జీ, డీఈవో వాసంతి పాల్గొన్నారు. ముం దుగా ప్రముఖ కవులను స్మరించుకుని, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సాహిత్య దినోత్సవం సందర్భంగా సీనియర్ కవులతో పలు కవితలను ఎంపిక చేశామ ని, ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ కవితలకు బహుమతులు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కవి సమ్మేళనంలో ప్రజెంట్ చేసిన కవితలను డాక్యుమెంటేషన్ చేస్తున్నట్లు వివరించారు. కాగా, తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలకు జిల్లా నలుమూలల నుం చి కవులు తరలివచ్చి తెలంగాణ ప్రగతిపై కవితలు వినిపించారు.
కొంతమంది కవులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కవితల రూపంలో వినిపించారు. తెలుగు, హిందీతోపాటు ఉర్దూ కవులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా అతిథుల చేతులమీదుగా కవులందరినీ సత్కరించి, జ్ఞాపికలు, నగదు పారితోషికం అందజేశారు. అలాగే, రాష్ట్రస్థాయిలో సత్కారం పొందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళిని సత్కరించారు. కాగా, తెలుగు కవితల పోటీల్లో ప్రథమ బహుమతి కోడెం సురేందర్, ద్వితీయ రావుల కిరణ్మయి, తృతీయ బహుమతి సీ జనార్దన్రావు గెలుచుకున్నారు. వీరితోపాటు హిందీ, ఉర్దూ కవులను ఎంపిక చేసి బహుమతులు పంపిణీ చేశారు. న్యాయ నిర్ణేతలుగా చక్రవర్తుల శ్రీనివాస్, డాక్టర్ మడత భాస్కర్, ఎండీ గౌస్, ఎండీ ఇక్బాల్ వ్యవహరించారు. డీఎంహెచ్వో వెంకట రమణ, కమిటీ కన్వీనర్ రామా చంద్రమౌళి, సభ్యులు డాక్టర్ మస్నా వెంకటేశ్వర్లు, విప్పనపల్లి రవికుమార్, తిరునగరి నరేందర్, వహీద్ గుల్షన్, నాగవెల్లి జితేందర్, కొమ్మోజు శ్రీధర్, దామోదర్, వల్లి నాగేశ్వర్రావు, డీపీఆర్వో పల్లవి, ఆర్ఐ జలపతిరెడ్డి, బేరి సుధాకర్ పాల్గొన్నారు.