భీమదేవరపల్లి, డిసెంబర్ 31: రంగయపల్లి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్(Mandala Rajitha Mahender) తెలిపారు. అందుకోసం తనకు రానున్న గౌరవ వేతనాన్ని గ్రామాభివృద్ధికి కేటాయిస్తానని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వ్యాపారవేత్త లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి(Lakkireddy Tirupati Reddy)తో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Sneha Shabarish)కు మండల రజిత మహేందర్ వినతి పత్రాన్ని అందజేశారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రంగయపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ మండల రజిత మహేందర్ హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధిలో తనకు ప్రభుత్వపరంగా పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. జిల్లాలోనే రంగయ్యపల్లిని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి సైతం వెల్లడించారు. గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు సమిష్టిగా ముందుకెళ్లాలని, అభివృద్ధిలో తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ స్నేహ శబరీష్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో గ్రామ ఉప సర్పంచ్ ఎలబోయిన రజిత శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చవ్వాల బుచ్చయ్య, మాజీ ఎంపీటీసీ సట్ల రఘుపతి, జిమ్మల మల్లారెడ్డి ఉన్నారు.