హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25 : అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపులేనికారణంగా విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. క్రీడలు, ఉన్నత చదువులకు హాస్టల్‌కు వచ్చే విద్యార్థులకు శాపంగా మారింది. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెబుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో మాత్రం శూన్యంగా మారిందని తల్లిదండ్రులు, విద్యార్థులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టళ్లలో విద్యార్థులకు కష్టాలు తప్పడంలేదు. క్రీడలపై ఆసక్తి, ఉన్నతస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతారని ఎంతో ఆశతో తల్లిదండ్రులు స్పోర్ట్ హాస్టల్‌కు పంపిస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు.
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వరంగల్ రీజినల్ స్పోర్ట్స్ గర్ల్స్ హాస్టల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరెంట్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేఏఎస్ఎస్లోని హాస్టల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వుగా హాస్టళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతియేటా సుమారు వందకుపైగా హాస్టల్లో చేరుతారు. వీరితో పాటు నూతనంగా జేఎన్ఎస్లో ప్రారంభించిన స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్ విద్యార్థినులు సైతం గర్ల్ హాస్టల్లోనే ఉంటున్నారు.
పట్టించుకోని ఇంచార్జి అధికారి..
ప్రతిరోజూ వారికి సాయంత్రం క్రీడలతో పాటు ఉన్నత చదువులు నేర్పిస్తారు. స్పోర్ట్ ఆఫీసర్, హాస్టల్ నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రులు, విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న స్పోర్ట్స్ హాస్టల్లో సమస్యలకు నిలయంగా మారింది. స్పోర్ట్స్ స్కూల్‌కు పంపించిన విద్యార్థులు అనేక బాధలు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోబీ లేకపోవడంతో చిన్నారుల వారి బట్టలు వారే ఉతుక్కోవడంపై మండిపడటంతో దోబీని ఏర్పాటు చేసినట్లు వాపోయారు.
ఇంఛార్జి స్పోర్ట్స్ ఆఫీసర్ కొత్త ప్రశాంత్ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు, విద్యార్థులు వాపోతున్నారు. కొత్తగా వచ్చిన అతను కోచ్‌లతో సైతం ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నట్లు సమాచారం. అందరినీ కలుపుకునిపోవాల్సి అధికారి ఏక్నిరంజన్గా వ్యవహరించడంపై అతని తీరుపై మండిపడుతున్నారు.
రాత్రంతా దోమలతో..
రాత్రి వేళల్లో కరెంట్ లేకపోవడం వలన విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. ఉక్కపోత, దోమల కాటు కారణంగా క్రీడాకారులు నిద్రలేమితో బాధపడ్డారు. దీని వలన వారు అలసటగా గురవడమే కాకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. రాత్రంతా దోమలతో జాగరణ చేయాల్సి పరిస్థితి దాపురించిందని విద్యార్థినులు వాపోతున్నారు. దోమల స్వైరవిహారం, రాత్రంతా నిద్రపట్టలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని హాస్టల్ కరెంట్ ఉన్నా మా హాస్టల్లోనే పవర్ పోయిందని వాపోతున్నారు. కేర్ టేకర్ సైతం రాత్రి కరెంట్ పోతే ఉదయం వరకు స్పోర్ట్స్ ఆఫీసర్‌కు తెలియజేయకపోవడంపై మండిపడుతున్నారు.
బకెట్లు మోసిన విద్యార్థినులు..
గర్ల్ హాస్టల్లో రాత్రంతా కరెంట్ లేకపోవడంతో విద్యార్థినుల కాలకృత్యాలకు నీరు కరువయ్యాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం వరకు కరెంట్ లేకపోవడంతో హాస్టల్లో నీరు బంద్ అయ్యాయి. హాస్టల్‌కు ఎదురుగా స్పోర్ట్ ఆఫీసర్ కార్యాలయం ఉన్నా పట్టించుకోకపోవడం శోచనీయం. ఉదయం స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థినుల బాధలు వర్ణాతీతం. నీరులేక గోస పడ్డారు. చేసేదేమీ లేకపోవడంతో కేర్ టేకర్ పక్కన ఉన్న బోరు వేయడంతో చిన్నారులు బకెట్ల ద్వారా బాత్రూంలకు మోసుకెళ్లారు. చిట్టిచేతులతో పుస్తకాలు పట్టాల్సిన చిన్నారులు బకెట్లు మోస్తూ కనిపించారు. కలెక్టర్ దృష్టి సారించి హాస్టల్లో కొరవడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
