హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 7: వెంకటాపూర్‌లో ప్రతిపాదిత సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం, రామప్ప సరస్సు వారసత్వంపై ప్రభావం చూపుతుందని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ మెంబర్ ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కాకతీయ రుద్రేశ్వర(రామప్ప) దేవాలయం, వెంకటాపూర్ గ్రామంలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ప్రతిపాదించిన సుమారు 300 మీటర్ల లోతైన ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల వలన తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందన్నారు.
ఈ ప్రతిపాదిత గని ప్రాంతం రామప్ప సరస్సు, రామప్ప దేవాలయానికి దిగువ ప్రవాహ దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ ప్రాంతం భౌగోళికంగా నిర్మాణాత్మకంగా అస్థిరంగా ఉందన్నారు.
800 ఏళ్లనాటి రామప్ప దేవాలయంలో ఎన్నో భూకంపాలను ఎదుర్కొందని, ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌తో ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. ఇది ఒక సునామీ వంటి విపత్తుకు దారితీసే ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చని ఆయన వివరించారు.
సాంకేతిక విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని సింగరేణి కాలరీస్ సంస్థ సాంకేతిక నిపుణుల విశ్లేషణలను, అలాగే ప్రజల సామాజిక-సాంస్కృతిక భావోద్వేగాలను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. రామప్ప దేవాలయం, రామప్ప సరస్సు అనే గొప్ప ప్రపంచ వారసత్వ సంపదను రక్షించేందుకు ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.