హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 16 : కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు అక్రమార్జన డబ్బులు స్వాహా చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన యూనివర్సిటీ అధికారులు తూతూమంత్రంగా నాలుగుసార్లు నోటీసుల మీద నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. వీసీ, రిజిస్ట్రార్ వారికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే ఎడ్యుకేషన్ విభాగంలో అక్రమాలకు పాల్పడిన అధికారి తిరిగి మొత్తం డబ్బులు చెల్లించిన వెంటనే అతడిని తొలిగించారు. ఇతను మొత్తం డబ్బులు చెల్లించుకున్నా, వివరణకు గడువు ముగిసినా, విడుతలవారిగా డబ్బులు చెల్లిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకుండా తత్సారం చేయడంపై వీసీ, రిజిస్ట్రార్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాకతీయ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్(పీడీఎఫ్) వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కార్యాలయం ఇటీవల జారీ చేసిన తుది షోకాజ్ నోటీసుతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. యూనివర్సిటీ నియమావళి, యూజీసీ మార్గదర్శకాలు, కాంట్రాక్ట్ సర్వీసు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తెలుగు విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్(కాంట్రాక్ట్) డాక్టర్ మంథని శంకరయ్యకు వివరణ కోరుతూ ఈ నోటీసు జారీ చేశారు.
ఒకేసారి పీడీఎఫ్ ఫెలోషిప్.. కాంట్రాక్ట్ రెమ్యూనరేషన్..?
కేయూ రిజిస్ట్రార్ కార్యాలయం నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం 2011-2013 కాలంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ పొందుతున్న సమయంలోనే కాంట్రాక్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారనే అంశంపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని వలన జరిగినట్లు పేర్కొన్న ఆర్థిక లోపాలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంలో రూ.6,89,400 మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా విశ్వవిద్యాలయం ఆదేశించినట్లు నోటీసులో పేర్కొంది. ఇందులో ఇప్పటికే రూ.1,50,000 వేలు చెల్లించినట్లు, మిగిలిన మొత్తాన్ని 10 విడతల్లో చెల్లించేందుకు అభ్యర్థన సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై యూజీసీ, న్యూఢిల్లీ నుంచి వర్సిటీని వివరణ కోరినట్లు రిజిస్ట్రార్ కార్యాలయ నోటీసులో పేర్కొనడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఇది కేవలం విశ్వవిద్యాలయ అంతర్గత అంశంగా కాకుండా, సంబంధిత యూజీసీ నిబంధనల పరిధిలోనూ పరిశీలనకు వచ్చిన వ్యవహారంగా మారింది. యూజీసీ నుంచి వ్యాఖ్యలు కోరబడిన నేపథ్యంలో, విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం తగిన తదుపరి చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐదు రోజుల గడువు.. లేదంటే సస్పెన్షన్..!
ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేసిన తుది షోకాజ్ నోటీసులో ఐదు రోజుల్లోగా వివరణ సమర్పించాలని స్పష్టంగా పేర్కొంది. నిర్దేశిత గడువులో వివరణ ఇవ్వకపోతే సేవల నుంచి సస్పెన్షన్ చర్యలు ప్రారంభిస్తామని నోటీసులో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తుది షోకాజ్ నోటీసు జారీ కావడం, రూ.6.89 లక్షల రికవరీ అంశం తెరపైకి రావడం, యూజీసీ నుంచి వ్యాఖ్యలు కోరడం వంటి పరిణామాల నేపథ్యంలో విశ్వవిద్యాలయ పరిపాలన తదుపరి ఏ చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
వివరణ ఇవ్వాల్సిన గడువు కూడా పూర్తయింది. విశ్వవిద్యాలయ నిధులు, యూజీసీ ఫెలోషిప్‌లకు సంబంధించిన నిబంధనల అమలులో ఎలాంటి మినహాయింపులు లేకుండా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. షోకాజ్ నోటీసులో పేర్కొన్న ఆరోపణలు, అభ్యంతరాలపై సంబంధిత వ్యక్తి వివరణను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, నిబంధనల ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ నిధుల వినియోగంలో చిన్న అనుమానానికి తావులేకుండా, విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను కాపాడేలా అధికారులు ఈ వ్యవహారాన్ని కాలయాపన లేకుండా నిబంధనల ప్రకారం తేల్చాలని విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.