భీమదేవరపల్లి, జనవరి 5: కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో భక్తులకు పూర్తి సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం సాయంత్రం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆయా శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నప్పటికి అధికారులు సక్రమంగా పని చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా తహసీల్దార్, ఎంపీడీవో సమన్వయంతో ముల్కనూర్ – కొత్తకొండ, వేలేరు – కొత్తకొండ, మల్లారం – కొత్తకొండ, గట్ల నర్సింగాపూర్ – కొత్తకొండ మార్గాల్లో జంగిల్ కటింగ్, సైడ్ బర్మింగ్, గుంతల పూడ్చివేత తదితర పనులు పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
జాతరకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. వాహనాల పార్కింగ్, ఎడ్లబండ్ల రథాలు బస చేసేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని చెప్పారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి సదుపాయాలు కల్పించాలని దేవాదాయ శాఖ ఏసీ రామాల సునీతను ఆదేశించారు. అంతకుముందు వీరభద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ రావు, వరంగల్ డీఎం అర్పిత, పీఆర్ ఈఈ ఆత్మారాం, డీఈ శిరీష, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రి, డీఈ అనిల్, ఏఈ సతీష్, తాసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, తదితరులు పాల్గొన్నారు.