హనుమకొండ, ఆగస్టు 18 : హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుక రసాబసాగా మారింది. ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం చేయాలని ఆదేశించినప్పటికి వేడుకకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రాకపోవడంపై బీసీ సంఘం నాయకులు బొనగాని యాదగిరి గౌడ్, కుడా మాజీ చైర్మెన్ సంఘంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్‌తో పాటు పలువురు అసహనం వ్యక్తం చేసారు. బీసీలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాపన్న జయంతి వేడుకులు(ఉదయం 9.30గంటల నుంచి 10.30గంటల వరకు సమయం ఇచ్చారు) నిర్వహించారు.
ఈ వేడుకకు జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్‌తో పాటు అధికారులు, బీసీ సంఘాల నాయకులు, బీసీలు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించినప్పటికి జిల్లా కలెక్టర్ వేడుకకు ఎందుకు హాజరు కాలేదని అక్కడున్న అధికారులను నిలదీసారు. బీసీలు అంటే వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. వేడుకకు కలెక్టర్ రావల్సిందేనని పట్టుపట్టారు. దీంతో గొడువ ఎక్కువ అయ్యే పరిస్థితిని గమనించిన అధికారులు కలెక్టర్‌కు విషయం తెలియజేయడంతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశ మందిరానికి వచ్చి సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించడంతో గొడువ సద్దుమనిగింది.
అనంతరం బీసీ సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుక అధికారికంగా చేపట్టాల్సిన కార్యక్రమేనని అన్నట్లు తెల్సింది. అయితే సోమవారం గ్రీవెన్స్ఉన్నందున ప్రజలకు ఇబ్బంది కలుగరాదని ఉద్దేశంతో ఆలోగా కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పడం జరిగిందని, ఏదైనా విషయం ఉంటే రాతపూర్వకంగా ఇవ్వండి అని కలెక్టర్ బీసీ సంఘాల నాయకులకు సూచించినట్లు సమాచారం.