బచ్చన్నపేట, మే 01 : జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో పాటు దాతలు కూడా తోడ్పాటు అందించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్రామ సర్పంచి అల్వాల నర్సింగరావు అన్నారు. బచ్చన్నపేట గ్రామపంచాయతీకి రూ. 15 వేల విలువైన వాటర్ ప్యూరిఫైయర్ ను గ్రామానికి చెందిన శేషత్వం అనసూయ జ్ఞాపకార్థం దాత విశ్రాంత ఉపాధ్యాయులు శేషత్వం ఆంజనేయులు వితరణగా అందించారు.
వాటర్ ప్యూరిఫైయర్ ను దాత ఆంజనేయులుతో కలిసి సర్పంచి నర్సింగరావు శుక్రవారం ప్రారంభించి మాట్లాడుతూ బచ్చన్నపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి గ్రామానికి చెందిన ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారంతా తోడ్పాటునందించాలని కోరారు. గ్రామపంచాయతీలో సిబ్బందితోపాటు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు కూడా ఇకనుంచి శుద్ధమైన తాగునీరు అంద నుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు..