హనుమకొండగా వరంగల్ అర్బన్, వరంగల్‌గా వరంగల్ రూరల్ జిల్లా
స్వల్ప మార్పులతో ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మారిన రెండు జిల్లాల స్వరూపం.. ప్రాథమిక నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు
హనుమకొండ జిల్లాలో 14 మండలాలు
వరంగల్ జిల్లాలో 13 మండలాలు
వరంగల్‌లోకి వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు
హనుమకొండలోకి ఐదు మండలాలు
శాయంపేట, ఆత్మకూరు కూడా..
హనుమకొండ రెవెన్యూ డివిజన్‌లోనే కమలాపూర్
ప్రజల సూచనలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు
మనుగడలోకి వచ్చిన కొత్త జిల్లాలు
వరంగల్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాకతీయుల పాలనలో రాజధానులుగా వెలుగొంది చారిత్రకంగా విశేష ప్రాధాన్యం కలిగిన హనుమకొండ, వరంగల్ ప్రాంతాలు.. ఇప్పుడు అవే పేర్లతో జిల్లాలుగా మనుగడలోకి వచ్చాయి. ఈ పేర్లతో జిల్లాలుండాలనే వరంగల్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర సర్కారు గురువారం ఆమోదం తెలిపింది. ఈమేరకు వరంగల్ అర్బన్‌ను హనుమకొండగా, వరంగల్ రూరల్‌ను వరంగల్‌గా పేర్లు, స్వల్పమార్పులు చేస్తూ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచుకొని, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజల చిరకాల వాంఛ తీరిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొంటూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
చారిత్రక ప్రాధాన్యత ఉన్న వరంగల్, హనుమకొండకు మరోసారి అదే రకమైన గుర్తింపు వచ్చింది. కాకతీయుల రాజధానులుగా విలసిల్లిన వరంగల్, హనుమకొండ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటుచేసింది. వరంగల్ అర్బన్ జిల్లాను హనుమకొండగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్‌గా పేరు మార్చుతూ గురువారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మారిన జిల్లాలు వెంటనే మనుగడలోకి వచ్చాయి. చారిత్రక నేపథ్యం ఉన్న నగరాలను రాజధానిగా జిల్లాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వందల ఏండ్ల తర్వాత ఈ రెండు నగరాలకు మరోసారి అదే గుర్తింపు దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30రోజుల పాటు ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు తుది నోటిఫికేషన్లో మార్పులు చేసింది. దీని ప్రకారం వరంగల్ జిల్లాలో 13 మండలాలు, హనుమకొండ జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, దామెర, నడికూడతో పాటు ఆత్మకూరు, శాయంపేట మండలాలను హనుమకొండ జిల్లాలో చేర్చింది. వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్ మండలాలను వరంగల్ జిల్లాలో కలిపింది. ఇక వరంగల్ జిల్లాలో వరంగల్, నర్సంపేట.. హనుమకొండ జిల్లాలో హనుమకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కమలాపూర్ మండలాన్ని అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు హనుమకొండ రెవెన్యూ డివిజన్‌లోనే కలిపింది. తాజా మార్పుల ప్రకారం వరంగల్ జిల్లా విస్తీర్ణం 1805 చదరపు కిలోమీటర్లు, జనాభా 8.93 లక్షలు ఉంది. హనుమకొండ జిల్లా విస్తీర్ణం 1688 చదరపు కిలోమీటర్లు.. జనాభా 9.05 లక్షలు ఉంది. వరంగల్ అర్బన్ జిల్లా కొత్త కలెక్టరేట్ ఇక నుంచి హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌గా ఉంటుంది. వరంగల్ జిల్లా కేంద్రం వరంగల్‌లో ఉంటుంది. ఆజంజాహి లేదా ఆటోనగర్ ప్రాంతంలో అత్యాధునిక హంగులతో కొత్త కలెక్టరేట్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
సూచనల మేరకు మార్పులు..
వరంగల్ మహానగరంలో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాతిపదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, మంత్రుల విజ్ఞప్తి మేరకు వరంగల్, హనుమకొండ పేర్లను ఖరారు చేస్తున్నట్లు జూన్ 21న వరంగల్ పర్యటనలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జూలై 12న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులోని అంశాలపై అభ్యంతరా లు, సూచనలు తెలిపేందుకు ప్రజలకు 30 రోజుల గడువు ఇచ్చింది. రెండు జిల్లాల్లో కలిపి 133 సూచనలు వచ్చాయి. ప్రాథమిక నోటిఫికేషన్లో కమలాపూర్ మండలాన్ని పరకాల రెవెన్యూ డివిజన్లో చేర్చగా, హనుమకొండ రెవెన్యూ డివిజన్లో ఉంచాలని ఆ మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరారు. ఆత్మకూరు, శాయంపేట మండలాలను పరకాల రెవెన్యూ డివిజన్లో, హనుమకొండ జిల్లాలో చేర్చాలని అక్కడి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈమేరకు సూచనలు, విజ్ఞప్తులు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది.