మహబూబాబాద్ రూరల్/నల్లబెల్లి, ఏప్రిల్ 2 : వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్‌ను సాధించింది. ఈ మిర్చి మంచి ఆకర్షణగా ఉండి కారం తక్కువగా ఉండి, లావుగా ఉంటుంద ని, దీనిని ప్రధానంగా కాస్మోటిక్స్ వాటిలో ఎక్కువ వాడుతారు. ఇది క్వింటాకు రూ. లక్షకు పైగా రేటు ఉంటుంది. ఎకరాకు కేవలం ఆరు నుంచి ఏడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది.
మల్యాల జేవీఆర్ పరిశోధనా స్థానం, హార్టికల్చర్ యూనివర్సిటీ కలిసి చపాటా మిర్చి పంటపై అనేక పరిశోధనలు చేసి రైతులకు లాభాలు వచ్చేలా రిసెర్చ్ చేసి పంపించామని, దాని ఫలితంగా చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని మల్యాల (జేవీఆర్) శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కత్తుల నాగరాజు పేర్కొన్నారు.
భవిష్యత్తులో చపాటా మిర్చికి మంచి ధర పలకడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసుకునే సౌకర్యం లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చపాటా మిర్చిపై నిరంతరం పరిశోధనలు, కృషి చేసిన వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను నర్సంపేట ఎమ్మెల్యేగా ముందు చూపుతో చేసిన కృషికి గొప్ప ఫలితం రావడం ఆనందంగా ఉందని పెద్ది సుదర్శ న్‌రెడ్డి పేర్కొ న్నారు.
మన ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చపాట మిర్చి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఉమ్మడి వరంగల్‌లో ఒక పంటకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఇదే తొలిసారి.