హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 28 : మే 4న విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలచే జరగనున్న శ్రీభద్రకాళీ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మమాతృ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా కార్పెంటర్ వర్కర్స్ యూనియన్, వరంగల్ ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వ బ్రాహ్మణ అఫిషియల్స్ అండ్ ప్రొఫేషనల్ (నొపా) అసోసియేషన్, శ్రీకామాక్షి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహిళా సంక్షేమ సంఘాలు సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి.
హనుమకొండ రస్తాలో జరిగిన శ్రీభద్రకాళీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. సీనీయర్ నాయకులు పెందోట చక్రపాణి, సంగోజు మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ర్ట విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణామాచారి మాట్లాడుతూ మే 4న ఉదయం 7 గంటలకు శ్రీభద్రకాళీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ, శ్రీ భద్రకాళీ అమ్మవారికి జరిగే విశేష అభిషేక పూజలు, ఉదయం పల్లకిసేవ, సాయింత్రం శేష వాహన సేవలు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణలు జరుగుతాయన్నారు.
ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ర్ట తొలి శాసన సభాపతి, శాసన మండలి విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమనేత దాసోజు శ్రవణ్‌కుమార్, కేంద్ర ఓబీసీ కమీషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, రాష్ర్ట సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్ తదితరులు పాల్గొని శ్రీభద్రకాళీ అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలు, పండ్లు, ఫలాలు, గజమాలలు, చెరుకుగడలు సమర్పిస్తారన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని సమస్తవిశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘీయులు అందరూ జాతి అభిమానంతో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రాష్ర్ట, జిల్లా సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.