నయీం నగర్ : వైద్యాధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని, నిబద్ధతతో సేవలందించాలని ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్ అన్నారు. శుక్రవారం పూరిగుట్ట బస్తీ దవాఖాన(Basthi dawakhana), వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ సేవలందిస్తున్న తీరును, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్కి ల్యాబ్ పరీక్ష నిమిత్తం పంపిస్తున్న శాంపిల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రిపోర్టులను పరిశీలించి అందులో ఏవైతే అబ్ నార్మల్గా ఉన్నాయో వారిని పరీక్షించి తగిన చికిత్స అందించాలని లేదా అవసరమైతే సంబంధిత రిఫరల్ హాస్పిటల్కు పంపించి ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. కొందరితో ఫోన్లో మాట్లాడి వారి రిపోర్టులు, అందించిన సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సాయి సేవ ట్రస్ట్, స్పందన వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పూరి గుట్ట వైద్యాధికారి డాక్టర్ హరిత, వడ్డేపల్లి వైద్యాధికారి డాక్టర్ మాలిక, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ టి.మాధవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.