రాయపర్తి : వరంగల్ ( Warangal ) జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) కు శుక్రవారం బంగారం బాధితులు తాళాలు వేసి బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మండలంలోని రాయపర్తి, మైలారం, మహబూబ్ నగర్, పెరిక వేడు, తదితర గ్రామాలకు చెందిన బ్యాంకు ఖాతాదారులు తమ అవసరాల నిమిత్తం తమ వద్దనున్న బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నట్లు చెప్పారు.
గతేడాది నవంబర్ మాసంలో బ్యాంకులో దొంగలు పడి తాము కుదవపెట్టిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని వివరించారు. బ్యాంకులో దోపిడీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న తామంతా బ్యాంకు వద్దకు వచ్చి బ్యాంకర్లతో మాట్లాడగా గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఎటువంటి నష్టం జరగకుండా పరిహారం కట్టిస్తామని చెప్పారన్నారు.
కానీ తాము కుదవ పెట్టిన బంగారం ఇవ్వాలని కోరుతూ గత ఐదు నెలలుగా బ్యాంకు చుట్టూరా తిరుగుతున్న బ్యాంక్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు బ్యాంకు ఎదుట బైఠాయించి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకుంటామని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బంగారం బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.