మహబూబాబాద్ రూరల్, జూన్ 21: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప థకాన్ని తమకు వర్తింపజేయాలని మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం పలువురు బాధితులు అధికారులను వేడుకున్నారు. మండలంలోని సోమ్లాతండాకు చెందిన బదావత్ విజయ, మాధవాపురానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ, రామగిరి కవిత, వీఎస్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకన్న మాట్లాడుతూ ప్రతిరోజూ మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రేషన్, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు నంబర్, గ్యాస్ నంబర్ వివరాలను ప్రజాపాలన దరఖాస్తులో నింపి అధికారులకు ఇచ్చామన్నారు. అయినా నాలుగు నెలల నుంచి తమకు జీరో బిల్లు రావడం లేదన్నారు. తమ దరఖాస్తును కంప్యూటర్లో సరిగ్గా నమోదు చేయకపోవడంతో జీరో బిల్లు రావడం లేదని, అధికారుల తప్పిదంతో తాము బలవుతున్నామన్నారు. ఇప్పుడు అడిగితే తప్పులను సరిచేసే ఆప్షన్ తమ దగ్గర లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.