పోచమ్మమైదాన్, జూలై 13 : సినీ హాస్య, విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు ఓరుగల్లుతో ఆత్మీయ అనుబంధం పెనవేసుకుంది. ఆయన ఆకస్మిక మృతి కళాకారులు, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆయన లేని లోటు కళాకారులకు కన్నీరు తెప్పిస్తున్నది. చారిత్రక ఓరుగల్లు అంటే తనకు ఎనలేని అభిమానం, ప్రేమ ఉందని, భద్రకాళి, సమ్మక్క, సారలమ్మ తమకు ఇలవేల్పులతో సమానమంటూ చెబుతుండేవారని ఆయనతో కలిసి పనిచేసిన కళాకారులు గుర్తు చేసుకుంటున్నారు.
నవరస నట శిరోమణి పురస్కారం
కళా వాహిని ఆర్ట్ థియేటర్స్ అధ్యక్షుడు ఆకుల రమేశ్రాజా ఆధ్వర్యంలో 1994 ఫిబ్రవరి 14న హనుమకొండలోని లష్కర్ బజార్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆనాటి జనగామ ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా కోట శ్రీనివాసరావు నవరస నట శిరోమణి పుర స్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ప్రదేశాలైన వేయి స్తంభాల దేవాలయం, ఓరుగల్లు కోట, రామప్ప, లక్నవరం చూసి తానెంతో ముగ్ధుడయ్యానన్నారు.
జవహర్లాల్ స్టేడియంలో 1995, ఫిబ్రవరి 25న కళావాహిని టాప్ టెన్ ఫిల్మ్ అవార్డు కార్యక్రమంలో పలు సినీ నటులతో పాటు కోట శ్రీనివాసరావు పాల్గొని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఈ సందర్భంగా ఆనాటి మంత్రి దా స్యం ప్రణయ్భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై టాప్ టెన్ ఫిల్మ్ అవార్డులు ప్రదానం చేశారు. అదేవిధంగా ఆదర్శ లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో 18 మంది సినీ నటులు పాల్గొన్నప్పటికీ కోట శ్రీనివాసరావు విద్యార్థులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా హాస్టల్లో పనిచేస్తున్న కుక్లందరికీ రూ.500 చొప్పున అందజేసి ఆయన ఉదారత్వాన్ని చాటుకున్నారు. 1996లో వర్ధన్నపేటలో భారతీయ కళా నాటిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రా్రష్ట్రస్థాయి నాటికల పోటీల్లో పాల్గొని కళా సంస్థకు, కళాకారులకు తోడ్పాటునందించారు.