హనుమకొండ రస్తా, జులై 31: తెలంగాణలోని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పుని బీఅర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని, ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు అని అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల అనర్హత విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మూడు నెలలలోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించడం గొప్ప నిర్ణయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయమై ద్వందవైఖరితో వ్యవహరించడం మానుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పుని చూసిన తర్వాతనైనా ప్రజాస్వామ్య పద్దతులను పాటించాలని, వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీని వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ రాజకీయాలకతీతంగా నిర్ణయం తీసుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించే విధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.