వరంగల్ చౌరస్తా : ప్రతి ఒక్కరు వృద్ధుల పట్ల గౌరవాన్ని కలిగివుండాలని, వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అన్నారు. శనివారం ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్వర్యంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సహకారంతో ఎంజీఎం హాస్పిటల్ సిబ్బందికి 2007 తల్లిదండ్రులు-వృద్ధుల పోషణ-సంరక్షణ చట్టం, 2011 నియామావళిపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల వివక్ష పెరుగుతూపోతున్న దృష్ట్యా వారికి తగిన గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 2007లో చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
ఈ చట్ట ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో, హాస్పిటల్లలో వయోవృద్ధులకు తగిన విధంగా ప్రత్యేక వసతులు కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి మనిషి జీవితంలో వృద్ధాప్యం తప్పదని, ఇప్పుడు వారికి ఇచ్చే మర్యాద, గౌరవం తదుపరి తరం పిల్లలు మనకి ఇస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు. చట్టం వారికి కల్పించిన హక్కులను, వాటి మూలంగా వారికి సంక్రమించే అధికారాలను వివరించారు.
వృద్ధుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, ఇతరత్రా ఇబ్బందులకు గురిచేసినా చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. సాయికుమార్, ఎంజీఎంహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ వసంతరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండ్రెడ్డి మల్లారెడ్డి, హనుమకొండ అధ్యక్షులు దామెర నర్సయ్య, కళాంపుర దామోదర్, హెల్ఫెజ్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ పి.శ్యామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.