హసన్‌పర్తి, మే 19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని గ్రామాలు, డివిజన్ల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకుపోతున్నామని చెప్పారు. గ్రేటర్ 1, 2, 55, 65, 66 డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న పనులు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పదేళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపు మేరకు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ నాయకులతో పాటు పెద్దఎత్తున ప్రజలను భాగస్వాములుగా చేయాలన్నారు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పేదింటి ఆడబిడ్డల పెడ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ గొప్ప వరమని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. హసన్‌పర్తి మండలం, వివిధ డివిజన్లకు చెందిన 96 మందికి కల్యాణక్ష్మి, షాదీముబారక్ చెక్కులను హసన్‌పర్తిలోని బాలాజీ గార్డెన్లో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం అమలు చేస్తున్నదన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుతోందన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇలాంటి గొప్ప పథకాలు పెట్టి పేదల కళ్లలో ఆనందాన్ని నింపారన్నారు. కార్యక్రమలో ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సునీత, ఆత్మ చైర్మన్ చంద్రమోహన్, కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, జక్కుల రజితా-వెంకటేశ్వర్లు, గుగులోతు దివ్యరాణీ-రాజునాయక్, డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్, నరెడ్ల శ్రీధర్, అటికం రవీందర్, ఏరుకొండ శ్రీనివాస్, జంగ కుమార్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు జక్కు రమేశ్‌గౌడ్, మేరుగు రాజేశ్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ పాడి మల్లారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు విక్టర్‌బాబు, మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సముద్రాల మధు, మార్కెట్ డైరెక్టర్లు వీసం సురేందర్‌రెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.